Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పవర్‌ గెలిచింది..!

మున్సిపోల్స్‌లో వైసీపీ ప్రభంజనం

నెల్లూరు కార్పొరేషన్‌ క్లీన్‌ స్వీప్‌
10 మున్సిపాల్టీల కైవసం
కుప్పం కోట వైసీపీ పరం
దర్శి, కొండపల్లిలో టీడీపీ విజయం
కుప్పం విజయంపై మంత్రి పెద్దిరెడ్డికి అభినందన

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : కార్పొరేషన్‌, మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. నెల్లూరు కార్పొరేషన్‌, 12 మునిసిపాల్టీలు, నగర పంచాయతీలతోపాటు మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. అత్యధిక స్థానాల్లో మరోమారు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసుకుంది. 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా, అందులో 10 మున్సిపాల్టీలలో వైసీపీ గెలుపొందింది. ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టిల్లో టీడీపీ విజయం సాధించింది. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాల్టీ కోటపై వైసీపీ పాగా వేసింది. రాష్ట్ర ప్రజలంతా కుప్పం ఫలితాలపైనే ఆసక్తిగా ఎదురు చూశారు. కుప్పంలోని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించడంతో మున్సిపాల్టీని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక టీడీపీ ఈ ఎన్నికల్లోనూ ఆశించినంత ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడక్కడా కొన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, మెజార్టీ వార్డులను కైవసం చేసుకోవడంలో వెనుకపడిరది. కడప జిల్లాలోని కమలాపురం, రాజంపేటలో టీడీపీ ఉనికి చాటింది. బీజేపీ, జనసేన కూటమి ఎక్కువ సీట్లను సాధించలేక పోయాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎక్కడా విజయం దక్కలేదు.
నెల్లూరు కార్పొరేషన్‌, 10 మున్సిపాల్టీల్లో వైసీపీ విజయం
నెల్లూరు కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లకుగాను 54 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు జిల్లా కుప్పం, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, నెల్లూరు జిల్లాబుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లాబేతంచెర్ల, కడప జిల్లాలోని కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాఆకివీడు, కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాల్టీలను వైసీపీ కైవసం చేసుకుంది. కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టీలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైసీపీ14, టీడీపీ14, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఎట్టకేలకు స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో టీడీపీ ఈ మున్సిపాల్టిని దక్కించుకుంది. మున్సిపాల్టీల వారీగా సీట్ల వివరాలు కుప్పం మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులకుగాను ఏకగ్రీవంతో కలిపి వైసీపీ19, టీడీపీ6 గెలుపొందాయి. దాచేపల్లి మున్సిపాల్టీలో మొత్తం 20 వార్డులకుగాను వైసీపీ11, టీడీపీ7, బీజేపీ1, స్వతంత్య్ర అభ్యర్థి1 చొప్పున విజయం సాధించారు. గురజాలలో 20 వార్డులకుగాను వైసీపీ16, టీడీపీ3, బీజేపీ1 చొప్పున గెలుపొందారు. దర్శిలో 20 వార్డులకుగాను టీడీపీ13, వైసీపీ7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలో 20 వార్డులకుగాను వైసీపీ18, టీడీపీ2 స్థానాలు గెలుపొందాయి. బేతంచర్లలో 20 వార్డులకు వైసీపీ14, టీడీపీ6 చేజిక్కించుకున్నాయి. కమలాపురంలో 20 వార్డులకుగాను వైసీపీ15, టీడీపీ5, రాజంపేటలో 29 వార్డులకుగాను వైసీపీ24, టీడీపీ4, ఇతరులు1 చొప్పున విజయం సాధించారు. అనంతపురం జిల్లా పెనుగొండలో 20 స్థానాలకుగాను వైసీపీ18, టీడీపీ2 దక్కించుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 20 వార్డులకుగాను వైసీపీ12, టీడీపీ4, బీజేపీ3, ఇతరులు1 చొప్పున విజయం వరించింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో 31 స్థానాలకుగాను హోరాహోరీ పోటీ నడిచి, వైసీపీ17, టీడీపీ14 స్థానాలను దక్కించుకున్నాయి. ఇదే జిల్లాలోని కొండపల్లిలోనూ మొదటి నుంచి చివరి వరకు వైసీపీ, టీడీపీ మధ్య హోరా హోరీ పోటీ నడిచింది. ఇక్కడున్న మొత్తం 29 వార్డులలో వైసీపీ14, టీడీపీ`14, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఇక విశాఖ, కాకినాడ, ఏలూరు కార్పొరేషన్‌తోపాటు వివిధ మున్సిపాల్టీల పరిధిలోని డివిజన్లకు సాగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కుప్పం ఎన్నికల్లో విజయానికి వ్యూహకర్తగా నిలిచిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img