Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పసిడి పంచ్‌లు

కామన్వెల్త్‌లో భారత్‌ జోరు

బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌ సహా ముగ్గురికి స్వర్ణ పతకాలు
ట్రిపుల్‌ జంప్‌లో పసిడి, రజతం
హాకీలో అమ్మాయిలకు కాంస్యం
అథ్లెటిక్స్‌లో మరో రెండు
ఫైనల్స్‌లో సింధు
ఫురుషుల హాకీ ఫైనల్స్‌లో టీమిండియా

బర్మింగ్‌హామ్‌: బ్రిటన్‌లో జరుగుతున్న కామెన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా మరో ఏడు పతకాలను కైవసం చేసుకుంది. బాక్సింగ్‌లో పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నీతూ గంఘాస్‌, ట్రిపుల్‌ జంప్‌ లో ఎల్డోస్‌ పాల్‌ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాలను చేజిక్కించుకున్నారు. మహిళల బాక్సింగ్‌ 48 కిలోల విభాగంలో పోటీపడిన నీతూ గంఘాస్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ కు చెందిన డెమీ జేడ్‌ రెస్జాన్‌పై పంచ్‌ల వర్షం కురిపించి, మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించింది. అటు, పురుషుల బాక్సింగ్‌ 51 కిలోల విభాగంలో అమిత్‌ పంగల్‌ ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ కైరన్‌ మెక్‌ డొనాల్డ్‌ పై మొదటి రౌండ్‌లో 5-0,రెండో రౌండ్‌లో 4-1 స్కోర్లతో గెలుపొందాడు. కాగా తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. క్వార్టర్స్‌లో వేల్స్‌ బాక్సర్‌ హెలెన్‌ జోన్స్‌పై 5-0 తేడాతో, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ సావనా అల్ఫియాపై 5-0తో విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగు పెట్టిన నిఖత్‌ ఇక్కడా అదే అద్భుత ప్రదర్శన చేసింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం అందుకుంది.
ఇక అథ్లెటిక్స్‌ లో భారత ట్రిపుల్‌ జంపర్‌ ఎల్డోస్‌ పాల్‌ పసిడి పతకం గెలవగా, భారత్‌ కు చెందిన అబూబకర్‌ కు ఇదే క్రీడాంశంలో రజతం దక్కింది. పసిడి పతకం గెలిచే క్రమంలో ఎల్డోస్‌ పాల్‌ తన అత్యుత్తమ ప్రదర్శన 17.03 మీటర్లు నమోదు చేయడం విశేషం. అబూబకర్‌ 17.02 మీటర్లతో రెండోస్థానంలో నిలిచాడు. అథ్లెటిక్స్‌ లో మరో రెండు కాంస్యాలు కూడా భారత్‌ ఖాతాలో చేరాయి. మహిళల జావెలిన్‌ త్రోలో అన్ను రాణి, పురుషుల 10 వేల మీటర్ల నడకలో సందీప్‌ కుమార్‌ కాంస్య పతకాలను సాధించారు.
మహిళల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు న్యూజిలాండ్‌ 1-1తో స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌కు దారితీసింది. ఇందులో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. భారత జట్టు 2 గోల్స్‌ కొట్టి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ హాకీలో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, చివరిసారి 2006లో పతకం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత జట్టును రిఫరీ తప్పిదం దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో 0-3 తేడాతో ఓటమి చవిచూసింది.
ఫైనల్స్‌కు సింధు, లక్ష్యసేన్‌
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కామన్వెల్త్‌ క్రీడల షటిల్‌ బ్యాడ్మింటన్‌ లో ఫైనల్స్‌ లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సింధు 21-18, 21-17 సింగపూర్‌ క్రీడాకారిణి యియో జియా మిన్‌ పై వరుస గేముల్లో గెలుపొందింది. రెండు గేముల్లో సింగపూర్‌ షట్లర్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని రంగరించి, కీలక సమయాల్లో పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్‌ లో సింధు ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. సింధు మాత్రం పసిడి పతకానికే గురిపెట్టినట్టు కామన్వెల్త్‌ క్రీడల్లో తన ఆటతీరు చూస్తే స్పష్టమవుతుంది. సింధు ఫైనల్లో కెనడాకు చెందిన మిచెల్లీ లీతో తలపడనుంది. ఇక బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు లక్ష్యసేన్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్స్‌ లో సింగపూర్‌ షట్లర్‌ జియా హింగ్‌ థేపై 21-10, 18- 21, 21 -16 తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. కాగా కామన్వెల్త్‌ పతక విజేతలందరికీ ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
పురుషుల హాకీలో ఉత్కంఠ విజయం
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 3-2 తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక కొంత సేపటి వరకు రెండు జట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. ఆ తర్వాత అభిషేక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 1`0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మణ్‌దీప్‌ సింగ్‌ చేసిన మరో గోల్‌తో 2-0తో పటిష్ఠ స్థితికి చేరింది. కాగా దక్షిణాఫ్రికా తరపున రెయాన్‌ జూలిస్‌ గోల్‌ కొట్టడంతో స్కోరు 2-1కి చేరుకుంది. చివరిలో డ్రాగ్‌ ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు రెండో గోల్‌ చేయడంతో చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి భారత్‌ ప్రత్యర్థిని గోల్స్‌ చేయకుండా అడ్డుకొని ఫైనల్‌కు చేరింది.
48 పతకాలతో 4వ స్థానం…
కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌ తాజా గణాంకాల ప్రకారం.. 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో 4వ స్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు మొత్తంగా 48 పతకాలున్నాయి. 44 పతకాలతో ఉన్న న్యూజిలాండ్‌ 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 164 (61 స్వర్ణాలు) పతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆతిథ్య దేశం ఇంగ్లాండ్‌ 155 (50 స్వర్ణాలు), కెనడా 85 (23 స్వర్ణాలు) పతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణ కీర్తి విశ్వవ్యాపితమైంది: కేసీఆర్‌
కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన జరీన్‌కు అభినందనలు తెలిపారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img