Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పసుపు… గిట్టుబాటు ధర కరువు

. దిగుబడులు లేక రైతుల దిగాలు
. కనీసం పెట్టుబడులు కూడా దక్కని దుస్థితి
. కనీస మద్దతు ధర కల్పించని ప్రభుత్వం

విశాలాంధ్ర`భట్టిప్రోలు/బాపట్ల: పుడమి తల్లిని నమ్ముకుని వ్యవసాయమే జీవనాధారంగా పంటలను పండిస్తున్న రైతన్నకు పాలక ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పిం చడంలో విఫలం చెందుతున్నాయి. ఫలితంగా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో పసుపు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని కృష్ణానది తీరం వాణిజ్య పంటలకు నిలయం. తీర లంక గ్రామాలైన చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు, కన్నెగంటివారిపాలెం, పెదపులివర్రు, అక్కివారిపాలెం, గొరిగపూడి, వెల్లటూరు తదితర గ్రామాలలో ప్రధానంగా పసుపు, కంద, అరటి, మొక్కజొన్న, తమలపాకు, బొప్పాయి పంటలను సాగు చేస్తుంటారు. సదరు గ్రామాలలో 2017లో ఖరీఫ్‌ సీజన్‌ పురస్కరించుకొని సుమారు రెండు వేల ఎకరాలలో పసుపు పంట సాగు చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న దిగుబడులను చూసి రైతు కన్నీరు పెడుతున్నాడు. దుంప ఊట సమయంలో దుంప కుళ్లు తెగులు సోకడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడులు రావల్సి ఉండగా 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుండడంతో వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటా పసుపు కొమ్ముల ధర రూ.5 వేల నుంచి రూ.5,500 కు మించి పలకడం లేదంటున్నారు. ఇటు పసుపు పంటకు గిట్టుబాటు ధర లేక అటు దిగుబడులు లేక పెట్టుబడులు సైతం నష్టపోయామని లంక గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.50 వేలు నష్టం
పసుపు పంట సాగుకు ఎకరం భూమికి రూ.50 వేలు కౌలు చెల్లించి మరో 1.20 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు సాగు చేశారు. ఎకరాకు ప్రస్తుతం వస్తున్న దిగుబడులకు మార్కెట్‌లో క్వింటా కొమ్ముల ధర రూ.5 వేల నుంచి రూ.5,500 పలుకుతోంది. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతికి రాకపోవ డమే కాకుండా ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్ట పోవల్సివచ్చిందని రైతులు వాపోతున్నారు. విత్తనం నాటే సమయంలో అధిక ధర పలికిన పసుపు ధర నేడు రూ.5,500 కు పడిపోయింది.
కనీస మద్దతు ధరను
రూ.8 వేలుగా నిర్ణయించాలి
వంట పసుపు కొమ్ములకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.8 వేలుగా నిర్ణయించి తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, కమిటీల నివేదికల ఆధా రంగా వారి సంక్షేమానికి కృషి చేస్తామంటూ పాలకులు ఇస్తున్న హామీలు అమలుకు నోచు కోవడం లేదు. గడచిన 20 సంవత్సరాలలో వ్యవసాయ రంగంపై 30కి పైగా కమిటీలను

వేశారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను చట్ట సభలలో చర్చించి అమలు చేసిన దాఖలాలు లేవు. ఆయా పంటల ఉత్పత్తుల విక్రయాలలో దళారీ వ్యాపారులు రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నా పాలకులు, ఆధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొన్నేళ్లుగా నష్టాలే
గత కొన్ని సంవత్సరాలుగా పసుపు రైతులు నష్టపోతూనే ఉన్నారు. దిగుబడులు ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడులు ఉండడం లేదు. ఈ కారణంగా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. భూమి కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరకు పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన రైతు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img