Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పారిశ్రామిక ప్రగతే లక్ష్యం

అందుకోసం ఎలాంటి సహకారానికైనా సిద్ధం
ఎగుమతుల్లో ఏపీ 19.43 శాతం వృద్ధి
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమస్థానం
మూడు పారిశ్రామిక కారిడార్లు గల ఏకైక రాష్ట్రం
రెండేళ్లలో రూ.20 వేల కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు
రూ.5 వేల కోట్లతో 16 వేల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు
వాణిజ్య ఉత్సవం ప్రారంభంలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ ఈ రెండేళ్లలో పెనుసవాళ్లు ఎదురైనప్పటికీ ఎగుమతుల్లో 19.43 శాతం వృద్ధి కనబర్చి ఏపీ నాలుగోస్థానంలో నిలిచిందన్నారు. సముద్రపు ఉత్పత్తులు మనల్ని ఆదుకున్నాయన్నారు. షిప్‌, బోట్ల నిర్మాణాల రూపేణా 8.5శాతం, ఫార్మారంగం 7.3శాతం, నాన్‌ బాస్మతి రైస్‌ 4.8 శాతం ఎగుమతుల్లో వృద్ధికి దోహదపడ్డాయన్నారు. ఈ ఒక్క ఏడాదే 2020-2021లో రూ.1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని సీఎం వివరించారు. దీనివల్ల 2018`19లో 9వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకున్నామన్నారు. కోవిడ్‌ కాలంలో దేశ జీడీపీ 7.3శాతం క్షీణించగా, రాష్ట్ర జీఎస్‌డీపీ 2.58శాతమే క్షీణించిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గత రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని, వీటిద్వారా 55వేల మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు. రూ.5,204 కోట్లతో 16,311 ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పామని, తద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఇవిగాకుండా రూ.36,384 కోట్లతో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయన్నారు. వీటివల్ల మరో 77వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్‌- బెంగళూరు వంటి మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌ ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ దృష్ట్యా మూడు వేల మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ.500 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, గెయిల్‌తో కలిసి గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలల ఏర్పాటు, 8 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు, 25 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో 5.8శాతం రాష్ట్రం నుంచి జరుగుతుండగా, 10 శాతం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా, మీరు ఇంకా మెరుగైన సలహాలిచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అభయమిచ్చారు. తొలుత ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేసి, ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ-పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వదేశీ, విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img