Friday, April 19, 2024
Friday, April 19, 2024

పార్లమెంటులో రగడ

. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై రభస
. క్షమాపణ చెప్పాలన్న అధికార పక్ష సభ్యులు
. అదానీ అక్రమాలను కప్పిపుచ్చేందుకేనన్న కాంగ్రెస్‌

న్యూదిల్లీ : ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ గందరగోళంతో పార్లమెంటు ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. బ్రిటన్‌లో దేశ పరువు తీసేలా మాట్లాడిన రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్‌ చేసింది. అదానీ అక్రమాలపై చర్చ నుంచి పారిపోయేందుకే బీజేపీ ఎదురు దాడి చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. రాహుల్‌ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ప్రతినినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్షాల నిరంతర నినాదాల మధ్య పత్రాలు, స్టాండిరగ్‌ కమిటీ నివేదికలు సమర్పించారు. ఆ తర్వాత అనేకమంది ఎంపీలు సభాధ్యక్ష స్థానం వద్దకు చేరుకున్నారు. సభ నిర్వహణకు సహకరించాలని అధ్యక్షస్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ పదేపదే చేసిన అభ్యర్థనలను ఎంపీలు పట్టించుకోకపోవడంతో ఆయన సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు సభలో సంస్మరణ సూచనల తర్వాత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేచి భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యల ద్వారా రాహుల్‌ గాంధీ లండన్‌లో భారతదేశ పరువు తీయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ లండన్‌కు వెళ్లి భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన అన్నారు. ఆయన భారతదేశం గౌరవం, ప్రతిష్టను ‘తీవ్రంగా దెబ్బతీయడానికి’ ప్రయత్నించాడు’ అని చెప్పారు. భారత ప్రజాస్వామ్య నిర్మాణాలపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని గాంధీ ఇటీవల లండన్‌లో ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య నిర్మాణాలపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని గాంధీ ఇటీవల లండన్‌లో ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలను సభ ఖండిరచాలని, క్షమాపణలు చెప్పాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకుడిని ఆదేశించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌… స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ‘ఈ సభ ద్వారా రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండిరచాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ సభలో క్షమాపణలు చెప్పాల్సిందిగా మీరు ఆయనను ఆదేశించాలి’ అని ఆయన అన్నారు. అయితే రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడటం ప్రారంభించకముందే పాలక ఎన్‌డీఏ సభ్యులు రాహుల్‌ క్షమాపణలు కోరుతూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ వెల్‌లోకి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని, కేంద్ర కేబినెట్‌ సక్రమంగా ఆమోదించిన ఆర్డినెన్స్‌ (యూపీఏ ప్రభుత్వ హయాంలో రాహుల్‌ గాంధీ) చింపివేయబడినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కినప్పుడు, ఎవరు అధికారంలో ఉన్నారో, అప్పుడు ప్రజాస్వామ్యానికి ఏమైంది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన, శరద్‌ పవార్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి కేబినెట్‌ మంత్రుల సమక్షంలో కేంద్ర కేబినెట్‌ సక్రమంగా ఆమోదించిన ఆర్డినెన్స్‌ను తుంగలో తొక్కి మూర్ఖత్వంగా అభివర్ణించినప్పుడు, ఆ సమయంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది’ అని అడిగారు. అప్పటి ప్రధాని నిస్సహాయంగా కనిపించినప్పుడు, అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని అని ఆయన ప్రశ్నించారు. ‘అమెరికా, యూరప్‌ వంటి విదేశీ శక్తుల జోక్యాన్ని కోరినందుకు’ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు జోషి చెప్పారు. ‘ఆయనకు కాస్త సిగ్గు ఉంటే ఈ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇదే మా డిమాండ్‌’ అని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని జోషి పేర్కొంటూ, ‘రాహుల్‌ గాంధీ స్పీకర్‌, సబాధ్యక్ష స్థానంపై విదేశీ గడ్డపై ఆరోపణలు చేశారు. కానీ ఆయన మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉంది. మాట్లాడేందుకు కావల్సినంత అవకాశం కల్పించి, స్వేచ్ఛగా సభలో మాట్లాడారు’ అని తెలిపారు. స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, మరింత బలపడుతుందన్నారు. ‘సభను సక్రమంగా నిర్వహించనివ్వండి. అందరికీ అవకాశం వస్తుంది. నినాదాలు చేయడం మంచిది కాదు. ఈ దేశ ప్రజలకు మన ప్రజాస్వామ్యంపై అపారమైన విశ్వాసం ఉంది. తరచూ మమ్మల్ని సందర్శించే విదేశీ ఎంపీలు, వారి స్పీకర్‌లు కూడా దీన్ని అంగీకరిస్తారు’ అని ఆయన తెలిపారు.
రాజ్యసభలోనూ అవే దృశ్యాలు
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇటీవల లండన్‌లో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీల పరస్పర ఆరోపణల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్న భోజనానికి ముందు వాయిదా పడిన సభ, తిరిగి ప్రారంభమైన తర్వాత సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు విదేశాలకు వెళ్లి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొనడం తీవ్రమైన అంశమని అన్నారు. ఇలాంటి ప్రకటనలను సభ ఖండిరచాలని, ఆయన క్షమాపణ చెబితే తప్ప దేశం క్షమించదని అన్నారు. విపక్ష నేత మల్లికార్జున్‌ ఖడ్గే గోయల్‌ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభకు గతంలో ఇచ్చిన రెండు తీర్పులను ఉటంకిస్తూ, సభా నాయకుడి వ్యాఖ్యలను తొలగించాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీలు అరుపులు, పరస్పర ఆరోపణలను కొనసాగించడంతో ధన్కర్‌ సభను రోజంతా వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img