Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పీఎస్‌యూల వేలం

ఇక డైరెక్టర్లకే మరిన్ని అధికారాలు
ప్రభుత్వ ప్రమేయం పరిమితం
మహా, నవ, మినీరత్నాలకు మంగళం
అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ బ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూదిల్లీ: ప్రజా సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్‌ వేగంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం విషయంలో మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా త్వరగా పెట్టుబడులు ఉపసంహరించేలా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినేట్‌ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థల్లో వేగంగా పెట్టుబడులు ఉపసంహరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పరిశ్రమలు, అనుబంధ సంస్థల మూసివేత, పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల బోర్డుకు కేబినెట్‌ అధికారం ఇచ్చింది. వీటితోపాటు అనేక సంస్థల్లో ఉన్న మైనార్టీ భాగస్వామ్యాలను సైతం వదులుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయ అధికారం ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. అనేక కీలక విభాగాల్లో ప్రభుత్వం భారీఎత్తున పెట్టుబడి పెట్టింది. వీటికి అనుబంధంగా అనేక అనుబంధ కంపెనీలను నెలకొల్పింది. అయితే తాజాగా అనుబంధ సంస్థలను మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకాకుండా ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకే కట్టబెట్టింది. దీనిద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
ఒకే దశలో ప్రైవేటీకరణ
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రక్రియలో భాగంగా బిడ్లను ఆహ్వానించడం, ఆ తర్వాత పరిశీలించడం, ఆపై నిర్ణయం తీసుకోవడం వంటి సుదీర్ఘ ప్రక్రియను కుదించింది. అందులో భాగంగా ప్రభుత్వ సంస్థల అమ్మకం ప్రక్రియను వేలం పాట ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఒకే

దశలో ప్రైవేటీకరణ పూర్తయిపోతుంది. అలాగే ప్రైవేటీకరణ జరగగా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రంగా పని చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం డైరెక్టర్లకు అప్పగించబోతున్నారు.
రత్నాలనూ అమ్మేందుకు రంగం సిద్ధం
ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతామంటూ చెప్పిన కేంద్రం ఇప్పుడు సరికొత్తగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరిస్తామని చెబుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన కేబినేట్‌ సమావేశంలో మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.
బయో ఇంధన విధానంలో మార్పులు
బయో ఇంధన విధానంలో కేంద్రం అనేక మార్పులు చేస్తూ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కొత్తగా ఫీడ్‌ స్టాక్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇతర ఇథనాల్‌ కలపడం తప్పనిసరి చేయనున్నారు. బయో ఇంధన కార్యక్రమం కింద ప్రత్యేక ఆర్థిక జోన్‌ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img