Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెగాసస్‌పై నిపుణుల కమిటీ

సుప్రీం కోర్టు నిర్ణయం
వచ్చేవారం మధ్యంతర ఉత్తర్వులు : సీజేఐ

న్యూదిల్లీ : పెగాసస్‌ వివాదంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడిరచింది. వచ్చేవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అన్నారు. కమిటీ సభ్యులను కూడా ఖరారు చేస్తామన్నారు. పెగాసస్‌ వ్యవహారంలో స్వతంత్ర విచారణను కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత, జస్మిస్‌ హిమకోహ్లి నేతృత్వ త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. పెగాసస్‌ వ్యవహారంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందిగానీ మరో అఫిడవిట్‌ దాఖలు చేయలేమని కోర్టుకు తెలిపారు. దీనిపై సీజేఐ రమణ స్పందిస్తూ మరో అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోతే మేమే మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. పెగాసస్‌పై విచారణనకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందుకు ఈ వారంలో ఉత్తర్వులు ఇవ్వాలని భావించగా అది సాధ్యపడలేదని చెప్పారు. సాంకేతిక నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగిందన్నారు. వచ్చే వారంలో ఉత్తర్వులు జారీచేసేందుకు ప్రయత్నిస్తామని సీజేఐ రమణ అన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వులో పెట్టింది. కాగా, దేశంలోని రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రముఖులు, జర్నలిస్టు ఫోన్‌ నెంబర్లను పెగాసస్‌ స్పైవేర్‌ సాయంతో హ్యాక్‌ చేసినట్టు మీడియా కథనాలు వెలువడటం, దీనిపై పార్లమెంటు దద్దరిల్లిపోవడం విదితమే. ఇదిలావుంటే ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశ భద్రతాంశాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని సూచించింది. పదేపదే ఇదే అంశాన్ని సొలిసిటర్‌ జనరల్‌ ప్రస్తావించడంపై సీజేఐ రమణ అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలోనూ చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నాం.. దేశ భద్రతా అంశాలను అడగడం లేదు. పౌరుల గోప్యతా హక్కు ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలు.. దీనిపై పకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశమిచ్చాం. కారణం ఏదైనా అందుకు కేంద్రం ఇష్టపడట్లేదు.. కాబట్టి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో ఆలోచించి నిర్ణయిస్తాం’ అని సీజేఐ రమణ అన్నారు. కమిటీ నివేదిక కూడా అఫిడవిట్‌ తరహాలోనే అందరి ముందరకు వస్తుందని చెప్పారు. పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు హాజరయ్యారు. కమిటీ ఏర్పాటు బాధ్యతను కేంద్రానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత ధర్మాసనం ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలో నిర్ణయించుకొని తెలియజేస్తామని తెలిపింది. సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు మాత్రం వచ్చే వారంలో ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img