Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘పెగాసస్‌ స్పైవేర్‌’పై అఫిడవిట్‌ ఇవ్వలేం

నిపుణుల కమిటీ నివేదికను సమర్పిస్తాం..
సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం
మధ్యంతర ఉత్తర్వులిస్తామన్న న్యాయస్థానం

న్యూదిల్లీ : పెగాసస్‌ స్నూపింగ్‌ వ్యవహారంపై స్వతంత్య్ర దర్యాప్తును కోరుతూ దాఖలయిన పిటిషన్లపై ఒక సవివరమైన అఫిడవిట్‌ను ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఈ కేసులో సవివరమైన అఫిడవిట్‌ను దాఖలు చేయడం గురించి పునరాలోచిస్తే, దానిని తమ ముందు సమర్పించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం తరఫున హాజరయిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు తెలిపింది. ‘మేము తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నాము. వచ్చే రెండు, మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తాము. దాని గురించి పునరాలోచనలో ఉంటే మీరు ఆ విషయాన్ని మా ముందు ప్రస్తావించవచ్చు’ అని న్యాయమూర్తులు సూర్య కాంత్‌, హిమా కోహ్లిలతో కూడిన బెంచ్‌ పేర్కొందని న్యాయాధికారి చెప్పారు. ‘ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలనుకోవడం లేదని మీరు(సొలిసిటర్‌ జనరల్‌) పదేపదే చెబుతున్నారు. మా ముందు ఎటువంటి భద్రతాపరమైన విషయాలను ఉంచాలని కూడా మేము కోరడం లేదు. ఒక కమిటీని ఏర్పాటు చేసిన నివేదికను సమర్పిస్తామని మీరు చెబుతున్నారు. మేము మొత్తం విషయాన్ని పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాము’ అని బెంచ్‌ పేర్కొంది. కాగా కారణం ఏదైనా కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపింది. ‘పెగాసస్‌ అంశం అత్యంత ముఖ్యమైనదే. అయితే ఒక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగించిందా లేదా అన్నది బహిరంగంగా చర్చించే అంశం కాదు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ సమాచారాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌ సరిపోతుంది. సవివరమైన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం లేదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బహిరంగపర్చలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పెగాసస్‌ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ అన్ని ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుంది. నిపుణుల కమిటీ నివేదికను కోర్టుకు అందుబాటులో ఉంచుతాము’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. కేంద్రం సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘పెగాసస్‌ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. పౌరుల హక్కుల ఉల్లంఘటన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలు. ఇందులో గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలి. దీనిపై ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాము’ అని పేర్కొంది. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపింది. అఫిడవిట్‌ దాఖలు చేస్తారనే గత విచారణలో సమయం ఇచ్చామని, కానీ మీరు మరోలా మాట్లాడుతున్నారని ఎస్‌జీని ఉద్దేశించి సీజేఐ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కేంద్రం సుముఖంగా లేనందున రెండు, మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
కాగా సెప్టెంబరు 7న సుప్రీం కోర్టు పిటిషన్‌లపై తదుపరి ప్రతిస్పందనను దాఖలు చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి మరింత సమయం ఇచ్చింది. కొన్ని సమస్యల కారణంగా రెండవ అఫిడవిట్‌ దాఖలుపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధిత అధికారులను కలవలేమని మెహతా చెప్పారు. పెగాసస్‌ స్నూపింగ్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలయిన పిటిషన్లు ‘ఊహలు లేదా ఇతర ఆధారాలు లేని మీడియా నివేదికలు లేదా అసంపూర్ణమైన లేదా ధ్రువీకరించని అంశాలపై ఆధారపడి ఉన్నాయి’ అని కేంద్రం గతంలో సుప్రీం కోర్టులో పరిమిత అఫిడవిట్‌ దాఖలు చేసింది. పెగాసస్‌పై పార్లమెంటులో సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇప్పటికే వివరణ ఇచ్చారని కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. కొన్ని స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యాప్తి చెందిన తప్పుడు కథనాలను నిరోధించడానికి, లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన వివరించింది.
ఇదిలాఉండగా, ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వోకు చెందిన నిఘా సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ను వినియోగించి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పౌర ప్రముఖులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలకు సంబంధించి ఈ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగించి నిఘా పెట్టేందుకు 300కు పైగా భారత మొబైల్‌ ఫోన్ల నంబర్లు ఆ లక్ష్యిత జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న ఈ వ్యాజ్యాలపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయం వెల్లడిరచాలని కోరుకోవడం లేదని, కానీ ఈ అంశంపై ఒక అఫిడవిట్‌ను దాఖలు చేస్తే వచ్చే ‘సమస్య’ ఏమిటని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img