Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పెట్రోల్‌, డీజిల్‌ డబుల్‌ సెంచరీయే

సీపీఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశంలో
రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర-విశాఖ: మోదీ, జగన్‌ ప్రభుత్వాలు మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు డబుల్‌ సెంచరీ కొట్టడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. విశాఖలో ఆగస్టు 26, 27, 28 తేదీల్లో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘ సమావేశం మంగళవారం విశాఖలోని పౌర గ్రంథాలయంలో జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినట్లు కేంద్రం చెబుతోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ధరలు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఆ తరువాత 15 రోజుల వ్యవధిలో 14సార్లు ధరలు పెంచారని విమర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.20 పెరిగితే నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ గతంలో దిల్లీలో సిలిండర్లతో నిరసన ప్రదర్శన జరిపారని, ఆ విషయం ఇప్పుడెందుకు గుర్తు లేదని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న మోదీ…2014లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో రైతులు దీనస్థితిలో ఉన్నారన్నారు. కరోనా సమయంలో రెండున్నర కోట్లమంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. పేదరికం పెరుగుతోందని, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అదానీ గురించి ఎవరికీ తెలియదని, ఇప్పుడు ఆయన ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అన్నారు. ఎనిమిదేళ్లలో 30 సంస్థలను కొనుగోలు చేశారని, అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చాడని చెప్పారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులు అదానీ వశమయ్యాయని చెప్పారు. ఎక్కడ అవకాశం వచ్చినా మతపరమైన ఘర్షణలను బీజేపీ సృష్టిస్తోందని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్‌, తాజ్‌ మహల్‌, కుతుబ్‌మీనార్‌, కర్ణాటకలో హిజాబ్‌ వివాదాలను ప్రస్తావిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకునే సమయానికి రాష్ట్రం అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుందని రామకృష్ణ అన్నారు. అప్పులు తెచ్చి ఏ రంగాన్నీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద ఇప్పటి వరకూ లక్షా 40వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబుతున్నారని, మిగిలిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర వాటాగా అప్పు రూ.96వేల కోట్లు వచ్చిందని, ఆ తరువాత ఐదేళ్లలో చంద్రబాబు రూ.1.28 లక్షల కోట్లు అప్పుచేశారని, ఆయన అయిదేళ్లలో చేసిన అప్పు జగన్‌ ఏడాదిలోనే చేశారని వివరించారు. మద్య నిషేధాన్ని పూర్తిగా గాలికొదిలేశారని, మద్యం అక్రమాల ద్వారా ఏటా రెండు వేల కోట్ల రూపాయలు జగన్‌ ప్యాలెస్‌కి వెళ్తున్నాయని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఒకే సంస్థ ఇసుక కాంట్రాక్టు నిర్వహిస్తున్న పరిస్థితి లేదని చెప్పారు. ఇసుక ద్వారా అక్రమంగా వెయ్యి కోట్లు ఆర్జిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర పరిస్థితులపై వచ్చే మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. 1974 తరువాత విశాఖలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, 1975 తరువాత విజయవాడలో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆహ్వాన సంఘం
సీపీఐ రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘాన్ని ఎన్నుకున్నారు. పేటర్న్స్‌గా ఆచార్య కేఎస్‌ చలం, ఆచార్య చందు సుబ్బారావు, అధ్యక్షుడుగా మాజీ శాసనసభ్యుడు మానం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా జేవీ సత్యనారాయణమూర్తి, ఉప ప్రధాన కార్యదర్శులుగా బాలేపల్లి వెంకటరమణ, పొట్టిక సత్యనారాయణ, కోశాధికారిగా ఎం.పైడిరాజు, ఉపాధ్యక్షులుగా ఏజే స్టాలిన్‌, డి.ఆదినారాయణ, బీసీహెచ్‌ మసేన్‌, సీహెచ్‌ రాఘవేంద్రరావు, ఆర్‌వీ జగ్గారావు, ఎ.విమల, ఎం.రాజబాబు, జేవీ.ప్రభాకర్‌, కేఎస్‌ సురేశ్‌కుమార్‌, జీఎస్‌జేె అచ్యుతరావు, కార్యదర్శులుగా కేఎస్‌ఎన్‌ రావు, రమణబాబు, కె.సత్యన్నారాయణ, కె సత్యాంజనేయ, ఎం.రామునాయుడు, డీసీహెచ్‌ రాజబాబు, ఎస్‌.విష్ణుమూర్తి, డి.విమలమ్మ, ఈ.దేముడు, పి.పోతురాజు, ఎస్‌కే రెహమాన్‌, ఎ.రవికుమార్‌, పీఎస్‌ ప్రకాశ్‌, జి.గురుబాబులతో పాటు మరో 51 మంది కమిటీ సభ్యులతో ఆహ్వాన సంఘం ఏర్పాటైంది.
విరాళాలు : మహాసభ నిర్వహణ కోసం సమావేశంలో రూ.21.90 లక్షలకు హామీలు రాగా అందులో 2.45 లక్షల రూపాయలు సమావేశంలోనే వసూలయ్యాయి. సమావేశంలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img