Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై మహిళా సమాఖ్య నిరసన గళం

ప్రజా బ్యాలెట్లతో ప్రజాభిప్రాయ సేకరణ
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి : పి.దుర్గాభవాని డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వంట గ్యాస్‌, నూనెలు, విద్యుత్‌ చార్జీల ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్రంలో నిరసనలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ వద్ద ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని అధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించగా, రాష్ట్ర కోశాధికారి పంచదార్ల దుర్గాంబ, విజయవాడ నగర అధ్యక్షులు ఓర్సు భారతి, యువజన సమాఖ్య నాయకులు మోతుకూరి అరుణ్‌కుమార్‌, మహిళా సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న పాలక ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ధరల పెరుగుదలను సమర్థిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? అంటూ ఓటింగ్‌ నిర్వహించారు. అనంతపురం పట్టణంలో గ్యాస్‌ సిలిండర్లు పెట్టి ప్రజాభిప్రాయాలు సేకరించారు. దీనికి ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.పద్మావతి నాయకత్వం వహించగా, నాయకులు జయలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. కర్నూలు పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వి.జయలక్ష్మీ నేతృత్వంలో సంతకాల సేకరణ, ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.భాగ్య తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలోని సమాఖ్య నాయకులు నదియా తదితరులు నిరసనకు దిగారు. విశాఖ పట్నంలో జిల్లా నాయకులు బేగమ్‌, పరమేశ్వరి సంతకాల సేకరణ చేపట్టారు. విజయవాడలో పాల్గొన్న దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ధరల నియంత్రణ, నల్ల ధనం వెలికితీతంటూ ప్రచారం చేసి ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్‌ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం నుంచి కరోనా సంక్షోభంలో ప్రజలకు కోవిడ్‌ టీకా కోసం, ఆహారం కోసం వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రులు తప్పుడు లెక్కలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని డిమాండు చేశారు. జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం కష్టమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 70 నుంచి 80 శాతానికి పెరిగాయని, వంట గ్యాస్‌కు రాయితీ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇక కూరగాయలు ఉల్లిపాయలు, నూనె, చింతపండు వంటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీలు సైతం పెంచుకుంటూపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img