Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పెట్రో తగ్గింపు తంతు..!

పెంచేది కొండంత.. తగ్గించేది గోరంత
మోదీ సర్కార్‌ మోసపూరిత చర్య
వ్యాట్‌ పేరుతో మిగిలింది రాష్ట్రాల పైకి నెట్టిసిన వైనం
కేంద్రంపై ప్రజల ఆగ్రహం

న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేసిన మోదీ సర్కార్‌ బుధవారం పెట్రోల్‌, డీజిల్‌పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్‌ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది. దీపావళి ముందు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 మేర తగ్గించింది. అయితే ప్రభుత్వం పెంచేది కొండంత, తగ్గించేది గోరంత అని ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలకులు తగ్గింపు ప్రకటన చేసిన తర్వాత వెనువెంటనే కేంద్ర పాలిత ప్రాంతాలు లడఖ్‌, పుద్చుచేరితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.8.7, రూ.9.52 చొప్పున వ్యాట్‌ను తగ్గించాయి. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి రికార్డు స్థాయిలో రిటైల్‌ ఇంధన ధరలతో నష్టపోయిన వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఇది మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఇతర రాజకీయ పార్టీల పాలనలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీజేపీ, దాని భాగస్వామ్య పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బాగా తగ్గించడానికి దారితీసినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ధరల జాబితా పేర్కొంది. కాగా తక్కువ ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు కారణంగా ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై లీటర్‌కు తగ్గింపు రూ.1.97గా, లడఖ్‌లో అత్యధిక తగ్గింపు కారణంగా లీటర్‌కు రూ.8.70గా ఉంది. ఇక డీజిల్‌పై ఉత్తరాఖండ్‌లో లీటర్‌కు రూ.17.5, లడఖ్‌లో రూ.9.52గా ఉన్నట్లు ఆ జాబితా పేర్కొంది. అసోంలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గించారు. కేంద్రం తగ్గించిన దానితో కలిపి అక్కడ పెట్రోల్‌ రూ.12, డీజిల్‌ రూ.17 మేర తగ్గుతోంది. త్రిపురలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గించారు. హరియాణా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. కర్ణాటకలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.62, డీజిల్‌పై రూ.9.40, మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.6.89, డీజిల్‌పై రూ.6.96 తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.96, డీజిల్‌పై రూ.2.04 వ్యాట్‌ను తగ్గించింది. ఇప్పటివరకు వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తమిళనాడు ఉన్నాయి. ఆప్‌ అధికారంలో ఉన్న దిల్లీ, టీఎంసీ పాలనలోని పశ్చిమ బెంగాల్‌, టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. వామపక్షాల పాలిత కేరళలో ఇప్పటికే వ్యాట్‌ పది రూపాయలు తగ్గించడంతో తాజాగా ఎటువంటి తగ్గింపులు జరపలేదు. బుధవారం నాటి ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.5.7 నుంచి రూ.6.35 వరకు, డీజిల్‌ ధర రూ.11.16 నుంచి రూ.12.88 వరకు తగ్గింది. మే 5, 2020 నుండి ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయిలకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్‌ ధరలో మొత్తం పెరుగుదల లీటరుకు రూ.38.78కి చేరింది. ఈ సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.29.03కు ఎగబాకింది. ఇంధన ధరల పెరుగుదలను కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, ఇతర విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. ఇన్నాళ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అన్ని రాష్టాలూ ఇంధన ధరలు తగ్గించాలని అనేకమార్లు డిమాండ్లు చేస్తున్నా పట్టించుకోని బీజేపీ.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేసరికి వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img