Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేదలపై మరో పిడుగు

హౌసింగ్‌ రుణాలపై ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం
గ్రామాల్లో రూ.10, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.15`20వేలు చెల్లింపు
ఇల్లు ఇతరులకు అమ్మితే రూ.20 నుంచి రూ.40వేలు
46లక్షల మంది లబ్ధిదారుల హక్కులపై సర్కార్‌ ఆర్థిక బ్రహ్మాస్త్రం
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

అమరావతి : కరోనా కష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలపై మరో పిడుగు పడబోతోంది. ఇప్పటికెే ఉపాధి అవకాశాలు దెబ్బతిని, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం వాడిన విద్యుత్‌కు నష్టమొచ్చిందంటూ ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.4వేల కోట్లు ఈ నెల నుంచే ముక్కు పిండి వసూలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ బాధ నుంచి కోలుకోకముందే ఎవరి ఊహకు అందని మరో భారాన్ని సర్కార్‌ సిద్ధం చేసింది. ఎప్పుడో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించుకున్న పక్కా గృహాలపై వారికి హక్కు కల్పించే పేరుతో రూ.10 నుంచి రూ.40వేల వరకు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఆదాయం గణనీయంగా పడిపోయి, నవరత్నాల అమలు కోసం నిత్యం అప్పుల వేటలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 46 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారులను టార్గెట్‌ చేస్తోంది. ఇందుకోసం ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేటు ఆస్తిగా మార్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడిరచారు. 1983 నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు రుణాలతో కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్దే ఉన్నాయన్నారు. ఇలా రాష్ట్రంలో 46,67,301 మంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రుణ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.20వేలు చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని వెల్లడిరచారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చార్జీలు విధించాల్సి వస్తుందని చెప్పారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని, ఒకవేళ ఆ ఇల్లు ఎవరికైనా అమ్మిన పక్షంలో ప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలుచేసిన, అర్హత ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలలో రూ.20వేలు, మున్సిపాల్టీల్లో రూ.30వేలు, కార్పొరేషన్‌లలో రూ.40వేలు ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద కడితే సరిపోతుందన్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకోకుండా ఇల్లుకట్టుకుంటే, వారికి ప్రభుత్వం ఉచితంగా హక్కులు కల్పిస్తుందన్నారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా దాదాపు 46 లక్షల మందికిపైగా లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు.ఇక వైసీపీ ప్రభుత్వం ఇటీవల అందజేసిన ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడత ఆసరాకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిద్వారా లబ్ధిదారులకు దాదాపు రూ.6,470.76 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. ఆస్పత్రులు, స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.50 లక్షలు ఇస్తే శాటిలైట్‌ఫౌండేషన్‌ స్కూలుకు పేరు, కోటి రూపాయలు దానం చేస్తే ఫౌండేషన్‌ స్కూలుకు, రూ.3 కోట్లు ఇస్తే హైస్కూల్‌కు దాతల పేర్లు పెట్టనున్నారు. కోటి రూపాయలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, రూ.5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెడతారు. కాలేజీలో కానీ, స్కూల్లోకానీ క్లాస్‌రూం, అదనపు క్లాస్‌రూం, హాస్టల్‌, లైబ్రరీ, గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి అయ్యే ఖర్చును నూటికి నూరుశాతం భరించిన వారి పేర్లు 20 ఏళ్లపాటు ఆ నిర్మాణాలకు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ 1940 చట్టం సవరణకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇవిగాక మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు…
– విశాఖ జిల్లా అరుకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్‌స్కూల్‌ నిర్మాణం కోసం 15ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయింపు.
– చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐఓసీ టెర్మినల్‌ నిర్మాణం నిమిత్తం ఎకరం రూ.30లక్షలకు కేటాయింపు
– కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కోసం 53.45 ఎకరాల భూమి కేటాయింపు
– గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కోసం రెండు ఎకరాల కేటాయింపు
– గుంటూరుజిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయింపు.
– శ్రీశైలంలో జగద్గురు పండితారాధ్య సేవాసమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమి గజం రూ.10ల చొప్పున కేటాయింపు
– ఏపీ ఫాస్టర్‌ కేర్‌ గైడ్‌లైన్స్‌ 2021కి, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్‌ కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం
– రాయలసీమ కరువు నివారణలో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్‌-2లో భాగంగా పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ను 79.6 నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలనుంచి మినహాయింపు
– ఇక మైనార్టీ వర్గాలకూ సబ్‌ ప్లాన్‌, కడప జిల్లా కాశినాయన మండలంలో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
– శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ మంజూరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img