Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదల ఆహారంపై పన్ను బాదుడు

గోధుమ పిండి, పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం
జూదంపై సున్నా… వజ్రాలపై 1.5 శాతమే

న్యూదిల్లీ: ప్రధాని మోదీ విధ్వంసకర పాలనకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో యదేచ్ఛగా చట్టాలు, సవరణలు చేస్తుకొస్తున్నారు. పేదలపై కనికరం చూపకుండా సంపన్న వర్గాలకు, విలాసం, వినోదాలకు ఖర్చు పెట్టే వర్గాలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. దేశంలో అమలవుతున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తంతు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. పేదల ఆహారమైన గోధుమ పిండి, పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్‌టీ విధించి, జూదాలైన కాసినోలు, గుర్రపు పందేలపై జీఎస్‌టీ రద్దుకు సిఫార్సులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, ఎల్‌ఈడీ ల్యాంపులు, కత్తులు, బ్లేడ్లు వంటి వాటిపై 12 శాతం జీఎస్‌టీని 18 శాతానికి పెంచడం, మరోవైపు, గతంలో హోటల్‌ గది అద్దె రోజుకు రూ.వెయ్యి లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఏకంగా 12 శాతం పన్ను విధించాలని నిర్ణయించడం, అలాగే ప్రీ ప్యాక్డ్‌, ప్రీ లేబుల్డ్‌ ఆహార ధాన్యాలు, చేపలు, పన్నీర్‌, లస్సీ, తేనె, గోధుమ పిండి, ఫ్రీజ్‌ చేయని మాంసంపై 5 శాతం జీఎస్‌టీ వంటివి పేదలపై భారం వేసి బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే. మోదీ సర్కార్‌ జీఎస్‌టీకి సంబంధించి ఐదేళ్లలో వెయ్యి సవరణలు చేసుకువచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోకుండా ప్రజలపై అడ్డగోలు పన్ను భారాలు మోపుతోంది. మోదీ ప్రభుత్వం 2017 జులై 1న జీఎస్‌టీని అమలులోకి తెచ్చింది. జీఎస్‌టీ వల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని అనేక మంది ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. అదే విషయం ఇప్పుడు తేటతెల్లమయింది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే, కరోనా విపత్తు పూర్తిగా దివాళా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం.. కొత్త పన్నులు విధిస్తున్నది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్‌టీ విధించింది. అలాగే ఇప్పటికే వైద్యరంగంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల మోత మోగించింది. తాజాగా ఆస్పత్రి గదులపైనా పన్ను వేసింది. రోగుల గదుల రోజువారీ చార్జీ (ఐసీయూ మినహా) రూ.5 వేలు దాటితే 5 శాతం జీఎస్‌టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరుగనున్నది. ఆస్పత్రుల్లో ఉండే బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైనా జీఎస్‌టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
జీఎస్‌టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95 శాతంగా ఉంది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా.. ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా 7.79 శాతం నమోద యింది. ప్రస్తుతం దాదాపు 7 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. దీంతో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి, మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీఎస్‌టీ చట్టం రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తున్నది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే ఆ పరిహారం ఇవ్వకుండా నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img