Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదల ఇళ్ల కోసం ఫిబ్రవరి 22న మహాధర్నా

. పోరుబాట పోస్టరు ఆవిష్కరణ
. జనవరి 17`30 తేదీల్లో సంతకాల సేకరణ
. ఫిబ్రవరి 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
. ప్రజలంతా భాగస్వాములు కావాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, జగనన్న ఇళ్లు నిర్మించాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 22న విజయవాడలో సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త అధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహాధర్నా తలపెట్టామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. ఈనెల 17 నుంచి 30 వరకు పెద్దఎత్తున పోరుబాటకు పిలుపునిచ్చామన్నారు. జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం లబ్ధిదారులకు కేటాయించాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేపడతా మని పేర్కొన్నారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జి.ఈశ్వరయ్య, జంగాల అజయ్‌కు మార్‌తో కలిసి పోరుబాట పోస్టరును ఆవిష్కరిం చారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాదాపు 25వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అందులో అధికార నేతలు తిన్నంత తిన్నారనీ, పేదలకు మాత్రం సెంటు స్థలం ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలనీ, వారికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించాలని తాము మొదటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దానిపై జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రమూ స్పందించలేదని మండిపడ్డారు. 32 లక్షల మందికి జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తామని సీఎం జగన్‌ చేసిన ఆర్భాటపు ప్రకటనకూ, ఆచరణలో పనులకూ పొంతన కనిపించడం లేదన్నారు. మొదట్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని చెప్పి…ఇవాళ లబ్ధిదారులే వాటిని కట్టుకోవాలంటూ మాటమారుస్తోందని, జగనన్న ఇంటి నిర్మాణానికి ఇస్తున్న లక్షా 80 వేలు ఎలా సరిపోతాయని రామకృష్ణ ప్రశ్నించారు. సిమెంట్‌, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినందున అర్హులందరికీ ఇసుక, సిమెంట్‌ ఉచితంగా ఇచ్చి… ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లు ఐదు మాత్రమేనని పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన విషయాన్ని రామకృష్ణ గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువుపోయినా జగన్‌కు సిగ్గురాలేదన్నారు. టిడ్కో ఇళ్లు నాలుగేళ్లుగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ‘నేనున్నా’ అని జగన్‌ ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు మాట తప్పి…పేదలను అప్పుల పాల్జేశారని మండిపడ్డారు. పైగా ఇళ్లు నిర్మించుకోకుంటే వాటిని రద్దు చేస్తామంటూ వలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇళ్ల సమస్యలపై ఈనెల 17 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి, సంతకాల సేకరణ చేపడతామని వివరించారు. 30న లబ్ధిదారులతో కలిసి స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే…ఫిబ్రవరి 6న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేపట్టి, వినతులు ఇస్తామన్నారు. అంతిమంగా ఫిబ్రవరి 22న విజయవాడలో రాష్ట్రస్థాయి మహాధర్నా చేపడతామని ప్రకటించారు. దీనికి పేదలంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులకు న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఈ ఉద్యమ కార్యాచరణకు అన్నిచోట్లా ప్రభుత్వం తమకు అనుమతివ్వాలని కోరారు.
అదనపు డీజీపీకి సంబంధం ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన జీవో1కీ, అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు సంబంధం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. జీవోపై అయ్యన్నార్‌ ఏదేదో మాట్లాడాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ర్యాలీలు, సభలు జరపాలంటే 34 బిరా మీటరు ఉండాలని అయ్యన్నార్‌ చెప్పారనీ, ఆ వివరాలేమిటో ప్రజలకు వెల్లడిరచాలని డిమాండ్‌ చేశారు. జీవో జారీ చేసిన హోమ్‌శాఖ కార్యదర్శిగానీ లేదా డీజీపీగానీ ఏమి చేస్తున్నారన్నారు. జీవో1లో అరుదైన పరిస్థితి అనేకంటే…అధికార పార్టీ కోసం అని రాసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇప్పటికే వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వకుండా జీవో తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తున్నారన్నారు. పండుగ చేసుకోవాలన్నా అనుమతులు తీసుకోవాలా అని నిలదీశారు. ఈ జీవోను రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటల్లో దహనం చేసి…నిరసనకు దిగుతామన్నారు. అన్ని పార్టీలు ఈ నిరసనలో పాల్గొనాలని రామకృష్ణ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img