Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదల భూములు పంచుకుంటారా?

ఇళ్లు నిర్మించుకోండి…అండగా ఉంటాం
శెట్టిపల్లి భూములు పరిశీలించిన నారాయణ

విశాలాంధ్రబ్యూరో` తిరుపతి : చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న హక్కుదారులు తమ నివేశన స్థలాలలో ఇళ్లు నిర్మించుకోవాలని, వామపక్షాలు అండగా ఉంటాయని శెట్టిపల్లి భూ బాధితులకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ భరోసా ఇచ్చారు. తిరుపతి అర్బన్‌ శెట్టిపల్లి గ్రామపంచాయతీ బాధితుల భూములను నారాయణ గురువారం స్వయంగా పరిశీలించారు. సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్దసంఖ్యలో నారాయణ వెంట ఉన్నారు. బాధితులు తమ సమస్యలను నారాయణకు వివరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ శెట్టిపల్లి రైతులు, నిరుపేదల భూములు లబ్ధిదారులకు పంచడానికి మీరెవరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు లబ్ధిదారులకు సహాయపడకుండా బినామీలకు వత్తాసు పలుకుతూ కోట్లాది రూపాయలు దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 500 ఎకరాలు ప్రజాఅవసరాల కోసం తీసుకొని వాటిని సక్రమంగా ఉపయోగించలేదని, ఈలోగా చంద్రబాబు దిగిపోవాల్సి వచ్చిందన్నారు. ఆ భూములను బాధితులకు అప్పగిస్తామని నాడు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఆయన మాటమీద నిలబడలేదని నారాయణ విమర్శించారు. ఆ భూములను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారన్నారు. పేదల భూములు బలవంతంగా లాక్కోవడం సరికాదని హితవు పలికారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని, ఎవరి స్థలంలో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఐ, సీపీఎం నాయకత్వంలో తామే స్వయంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దశత్రువని, అలాంటి బీజేపీ పంచన చేరడం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు మంచిది కాదని నారాయణ సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేయాలని హితవు పలికారు. బీజేపీతో టీడీపీ, జనసేన కలిస్తే అసలుకే మోసం వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్‌ కష్టపడుతున్నా…సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల మధ్య కారణంగానే శెట్టిపల్లి రైతులు, ఇళ్ల స్థలాల పేదలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తిరుపతికి సమీపంలో తక్కువ ధరకు వస్తున్నాయని గతంలో పోలీసులు, రెవెన్యూ, మున్సిపాలిటీ ఉద్యోగులు, జర్నలిస్టులు ఇక్కడి భూములు కొనుగోలు చేసి… రిజిస్టర్‌ చేసుకున్నారని, ఆ భూములను అధికార పార్టీ నేతలు కబ్జాకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే కలెక్టర్‌, ఆర్డీవో జోక్యం చేసుకొని సమస్యను సున్నితంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్‌ సందర్భంగా పోరాటంలో భాగంగా శెట్టిపల్లి రైతులు తమ ప్రాణాలు సైతం అర్పించారని గుర్తుచేశారు. అనేక పోరాటాల ఫలితంగానే నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ బాధితులకు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ శెట్టిపల్లి రైతులు, పేదలకు అండగా ఉంటామన్నారు. ఈ భూములు పేదల సొత్తని, వీటి జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. నారాయణ వెంట సీపీఐ నేతలు చిన్నం పెంచలయ్య, కె.రాధాకృష్ణ, విశ్వనాథ్‌, బి.నదియా, ఉదయ్‌కుమార్‌, బండి చలపతి, ఎన్‌డీ రవి, ఎన్‌ శివ, కేవై రాజా, కె.పద్మనాభ రెడ్డి, సీహెచ్‌ శివకుమార్‌, మోహన్‌రెడ్డి, ఎంవీయస్‌ మూర్తి, జె.నాగరాజు, వై.ఎస్‌ మణి, భూ బాధితుల సంఘం నాయకులు కృష్ణ, డప్పు సూరి, రాధాకృష్ణ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img