Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదల భూములు పెద్దలకా…?

ఉంటే సొంతింట్లో… లేదంటే జైల్లో…
కడప జిల్లా చిట్వేలిలో సీపీఐ భూపోరాటం
న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రం
సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర`చిట్వేలి : పేదలకు కేటాయించిన భూములు పెద్దలు అక్రమిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. బుధవారం జిల్లాలోని చిల్వేలి మండలం, గట్టుమీద పల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల్ని కోల్పోయిన బాధితుల పక్షాన భూపోరాటాన్ని ప్రారంభించింది. ఆ గ్రామం పరిధిలో ఉంటున్న పూసల, బుడబుక్కల, దొమ్మర వర్గాలకు చెందిన 80 కుటుంబాల వారికి 2017లో నాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. నాటి తహసీల్దార్‌, వీఆర్‌వోలు లక్కీ డిప్‌ పద్దతిలో ఆ పేదలకు ఇంటి పట్టాలను కూడా పంపిణీ చేశారు. అయితే పట్టాలు పేదల పేరుతో ఉన్నా వాటిపై కన్నేసిన బడాబాబులు అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో రాత్రికి రాత్రే ఆభూములను తమ పేర్లపైకి మార్చుకున్నారు. తాజాగా భూమి పట్టాలున్న పేదలు అక్కడ ఇళ్లను నిర్మించుకోవడానికి అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆశ్రయిస్తే అక్కడ మీకు ఇంటి పట్టాలే లేవని తేల్చడంతో అసలు విషయం బయటపడిరది. పైగా గతంలోనే మీకు ఇంటి పట్టాలు కేటాయించడంతో తాజాగా వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న జగనన్న కాలనీల్లోనూ ఇళ్ల్ణస్థలాలు ఇవ్వడం కుదరదని అదే అధికారులు తేల్చి చెప్పడంతో బాధితులంతా సీపీఐ నేతను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీపీఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య నాయకత్వంలో పేదల భూములను వారికి అప్పగించాలని డిమాండు చేస్తూ గట్టుమీద పల్లి గ్రామం వద్ద పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద పార్టీ జండాలు నాటి భూపొరాటాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పేదలకు అధికారికంగా కేటాయించిన ఇళ్ల స్థలాలు పెద్దల వశమైనా ప్రభుత్వానికి పట్టాదా అంటూ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పేదలకు కేటాయించిన భూముల్లోని వందల ఎకరాలు అన్యాక్రాంతమైనా అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనాఈ పేదలకు జరిగిన నష్టాన్ని గుర్తించి ఇళ్ల స్థలాలు చూపించాలని డిమాండు చేశారు. పేదల భూములను అక్రమంగా కాజేసిన దోపిడీదారులపై, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ విషయంలో సత్వర న్యాయం జరుగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, ఉంటే సొంత ఇంట్లో ఉంటాం లేదంటే జైలులో ఉండడానికి కూడా సిద్దమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఆక్రమణలు చాలా ఉన్నాయని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి దర్జాగా తిరుగుతున్న ఆక్రమణ దారులపై చర్యలు చేపట్టకపోతే ఆయా భూముల్లో సీపీఐ జండాలతో భూపోరాటాలకు కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాజంపేట ఏరియా కార్యదర్శి, పి మహేష్‌, చిట్వేల్‌ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్‌, ఓబులవారిపల్లె మండల కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా కన్వినర్‌ కెశం ప్రసాద్‌, డీహెచ్‌పీఎస్‌ ఏరియా కార్యదర్శి హరీష్‌, వ్యవసాయ కార్మిక సంఘం చిట్వేల్‌ మండల కార్యదర్శి సామ గంగయ్య, గట్టుమీదపల్లె గ్రామ కార్యదర్శి చుక్కా రామయ్య, మస్తాన్‌, ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img