Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదోడి బియ్యం పక్కదారి

. ఒడిశా నల్లబజారుకు తరలింపు
. లక్షల్లో వ్యాపారం…అధికారుల చోద్యం

విశాలాంధ్ర-కురుపాం(పార్వతీపురం మన్యం జిల్లా): పేదవాడి కడుపు నింపే రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్‌ బియ్యం సరిహద్దులు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పక్కన గల ఒడిశా నల్లబజారుకు తరలిపోతోంది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని దళారులు నేరుగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. దానిని పక్క రాష్ట్రానికి తరలించి…అధిక లాభాలు పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని కురుపాం, మొండెం ఖల్‌, నీలకంఠాపురం గ్రామాల్లో అక్రమార్కులు సిండికేటుగా ఏర్పడి…ఈ లావాదేవీలు సాగిస్తున్నారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని…వారి రేషన్‌ కార్డులు తాకట్టు పెట్టుకొని…నెలవారీ రేషన్‌ను దళారులే తీసుకుంటున్నారు. పేదల నుంచి కేజీ 12-14 రూపాయలకు కొనుగోలు చేయడం…సరిహద్దు ఆవలి గ్రామాల్లో రూ.22కు విక్రయిస్తున్నారు. ఈ రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి తిరిగి బహిరంగ మార్కెట్‌లో రకరకాల బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో రేషన్‌ బియ్యం మాఫియా అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. రాత్రి వేళల్లో వాహనాల ద్వారా బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే.
రీ సైక్లింగ్‌తో మోసం
లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్‌ చేసి, రబ్బరు పాలిష్‌ చేసి తిరిగి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పేదలకు పంపిణీ చేసే బియ్యం 70 శాతానికి పైగా ఒడిశాకు తరలిపోతున్నాయి. మరో 50 శాతం స్థానిక మార్కెట్‌లో వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు జరుగుతున్నాయి. 25 కేజీల బస్తా రూ.1050 నుంచి రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో బియ్యం ధర 25 కేజీల బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకూ పెరిగిన విషయం విదితమే. దీంతో ఎక్కువమంది మధ్య తరగతి, గిరిజన ప్రజలు తక్కువ ధరకు వస్తున్నాయని పాలిష్‌ చేసిన బియ్యాన్ని కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఈ దందాతో దళారులు, మిల్లర్లు భారీగా లాభాలార్జిస్తున్నారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తప్పవు: తహసీల్దారు
రేషన్‌ బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఆర్‌. రమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. పేదల కోసం పంపిణీ చేసే రేషన్‌ బియ్యం కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల పోషణ కోసం అందజేస్తున్న రేషన్‌ బియ్యాన్ని దళారులకు విక్రయించవద్దని లబ్ధిదారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పెంచామని, రేషన్‌ బియ్యం కొనుగోలుదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img