Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలవరంపై కేంద్రం షాక్‌

. నగదు బదిలీకి నిరాకరణ
. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి శాఖ
. వైసీపీ ఎంపీలు అలంకారప్రాయం
. స్వప్రయోజనాల కోసమే జగన్‌ వత్తాసు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
పోలవరంపై జగన్‌ సర్కారుకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరబోదంటూ తేల్చిచెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపడుతున్నందున కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి లేదంటూ తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడూ తిరిగి చెల్లిస్తున్నామని కేంద్రం నొక్కిచెప్పింది. లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడిరచారు. ఇది జగన్‌ సర్కారుకు, వైసీపీ ఎంపీల వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. నగదు బదిలీ అంశాన్ని తెలివిగా రాష్ట్రంపై కేంద్రం నెట్టేసింది. మొదటి నుంచి రాష్ట్రంపై కేంద్రంలోని మోదీ సర్కారు వివక్ష చూపుతోంది. కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీ సర్కారుకు కొమ్ము కాస్తున్నారు. దీంతోనే కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేక పోతున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాంటూ సీఎంకు ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు విజ్ఞప్తి చేసినా దానిని పెడచెవిన పెట్టారు.
కేంద్ర బడ్జెట్‌లోనూ వివక్ష
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తోంది. ఏ విషయంలోనూ ముందుకు రావడం లేదు. దీంతో పోలవరం పూర్తవ్వడం, నిర్వాసితుల పరిహారం ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ పోలవరం ప్రస్తావనే లేదు. దానికితోడు ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన అన్ని అంశాలపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ సీఎం జగన్‌ సర్కారు మౌనంగా ఉంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రంతో జగన్‌ వ్యవహరిస్తున్నారేగానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపైనా ప్రశ్నించడం లేదు. నాడు ఎన్నికల ముందు తనకు 25 మంది ఎంపీలిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ప్రకటించారు. ఆ దిశగా వైసీపీకి మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ…ఇంతవరకూ కేంద్రం నుంచి ఒక్క హామీని నెరవేర్చలేక పోయారు. మూడున్నరేళ్ల నుంచి కేంద్రంపై సీఎం జగన్‌తోపాటు ఎంపీలు ఎలాంటి ఒత్తిడి చేయకుండా అలంకార ప్రాయంగా ఉండిపోయారు.
నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ
ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున…నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ వంగా గీతా అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం నిర్వాసితుల పరిహరంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్రానికి ఆమోదంగా లేదని తేల్చిచెప్పింది. పోలవరం నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని షెకావత్‌ వెల్లడిరచారు. భూసేకరణ, పునరావాసంపై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకు రూ.3,779.05 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్లు, వాటిలో రూ.3,431.59 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకు ఏపీ ప్రభుత్వం రూ.2,267.29కోట్ల బిల్లులు సమర్పించగా, ఇప్పటివరకు రూ.2,110.23 కోట్లు తిరిగి చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఇది వైసీపీ ఎంపీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారింది. పోలవరం తమ హయాంలోనే ముందుకెళ్లిందంటూ జగన్‌తోపాటు ఎంపీలు, మంత్రులు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి దశకు చేరలేదు. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులకు సాగు, నీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జగన్‌ మేల్కొని అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు పునరావాస ప్యాకేజీపై కేంద్రం దిగివచ్చేంత వరకు ఒత్తిడి చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img