Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘పోలవరం’పై 5న దిల్లీలో ధర్నా

ఆదివాసి, ముంపు బాధితుల రక్షణ కోసం ఉధృత పోరాటం
పునరావాస చర్యలేవీ.. బాధితులను నీళ్లలో ముంచుతారా..?
పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు..?
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర – బషీర్‌బాగ్‌ : ఆదివాసి పరిరక్షణ, పోలవరం ముంపు బాధితుల రక్షణ కోసం ఆగస్టు 5 న్యూదిల్లీలో చేపట్టనున్న ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ, టీడీపీలకు చెందిన ఎంపీలు పాల్గొనాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో ఉండి ఏమీ సాధించలేనప్పుడు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని డిమాండు చేశారు.
ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమి తి నాయకులు, ఆంధ్రా మేథావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, జాతీయ ఆదివాసి అఖిల పక్షాల (జేఏసీ) కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే చంద లింగయ్య దొర, అఖిల భారత ఆదివాసి మహాసభ జాతీయ కార్యదర్శి రమావత్‌ అంజయ్య నాయక్‌తో కలిసి రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసి పరిరక్షణ, పోలవరం ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కోసం దిల్లీకి వెళ్లి ఎంపీల మద్దతు కోరతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో భూసేకరణ, పునరావాస చర్యలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సాక్షాత్తు కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడిని పెంచి నిధులను సాధించుకోకపోతే దళితులు, గిరిజనులు, ముంపు బాధితుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. బహుళార్ధక పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 196 టీఎంసీలను నిల్వచేసే సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోయే అవ కాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు బాధితులకు రూ.10 లక్షలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు, అనేక వేదికల మీద హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు బాధ్యత లేకుండా బాధితులను నీళ్లలో ముంచుతున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెబుతున్న సీఎం జగన్‌.. అధికారిని ఎప్పుడు నియమిస్తారు, బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తారు, వారికి ఎప్పటికి ఇళ్లు నిర్మించి ఇస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తామని, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ముంపు బాధితులను పట్టించుకోక పోవడంతో వారు సర్వం కోల్పోయి కొండల ప్రాంతా లలో నివసిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మాన వత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ముంపు ప్రాంత ఆదివాసిలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పన్నులపై పన్ను విధిస్తూ రాష్రా ్టలకు వాటాలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ఏపీ, తెలంగాణ ముఖ్య మంత్రులు, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని, కేంద్రాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నారని ఆయన విమర్శించారు.
చంద లింగయ్య దొర మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు ముంపు బాధితుల విషయంతో కేంద్రం తమకు సంబంధం లేదంటే ఎలా అని మండిపడ్డారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా తమకు సంబంధం లేదని చెబితే గిరిజనులు, ఆదివాసిలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. ఎవరికీ సంబంధం లేనప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారని అన్నారు. పోలవరం ముంపు బాధితుల సమస్యలపై అఖిలపక్ష సమావేశానికి కేంద్రంలోని బీజేపీ, వైసీపీ నేతలు హాజరవ్వలేదని, వారు దొంగలు కాబట్టే సమావేశానికి రాలేదని తెలిపారు. ఆదివాసిల పరిరక్షణ, ముంపు బాధితుల రక్షణ విషయమై ఈనెల 30న ఏపీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని, ఈ సమస్యపై న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img