Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలవరంలో మరో అడుగు

ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్‌ 3 నిర్మాణం పూర్తి

అమరావతి : పోలవరం ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడిరది. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయింది. 153.50 మీ పొడవున, 53.320మీ ఎత్తున,8.50 మీ వెడల్పున ఈ డ్యామ్‌ను నిర్మించారు. స్పిల్‌ వే నుండి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు అనుసంధానం చేయడానికి గ్యాప్‌-3 కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణం కీలకమైనది. దీని నిర్మాణానికి దాదాపు 23,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. పోలవరం హెడ్‌వర్క్స్‌లో 3 ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లలో గ్యాప్‌-3 ఒకటి. గ్యాప్‌-1, గ్యాప్‌-2 ఈసీిఆర్‌ఎఫ్‌లు రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు కాగా, గ్యాప్‌-3 మాత్రం కాంక్రీట్‌ డ్యామ్‌. 2019 నవంబరులో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కొక్కటీ పూర్తిచేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోంది. ఓవైపు వరదలు మరోవైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం అధిగమిస్తూ ప్రభుత్వ లక్ష్యం దిశగా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే కీలకమైన పోలవరం స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ నిర్మాణం పూర్తి కాగా, స్పిల్‌ వేలో అమర్చాల్సిన 48రేడియల్‌ గేట్లకుగాను 42గేట్లను అమర్చారు. రేడియల్‌ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్‌ సిలిండర్లకుగాను 84సిలిండర్లను అమర్చారు. అదేవిధంగా 10 రివర్‌ స్లూయిజ్‌ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. స్పిల్‌ ఛానెల్‌లో 35లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. అప్రోచ్‌ ఛానెల్‌లో దాదాపు 70లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ఇక కీలకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో 33,73,854, క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం సైతం దాదాపు 21 మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తి అయింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఇప్పటికే 3,15,237 క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img