Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోలవరం ఎత్తుపై ప్రతిపక్షాల దుష్ప్రచారం

. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు తొలిదశలో నీటినిల్వ 41.15 మీటర్లు
. పూర్తిస్థాయిలో 45.7 మీటర్లు ఎత్తు నిర్మించి తీరుతాం
. ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలిస్తాం
. అసెంబ్లీలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ముందుగా నిర్ణయించిన ప్రకారం 45.7 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో గురువారం పోలవరం అంశంపై జరిగిన లఘు చర్చలో సీఎం జగన్‌ మాట్లాడారు. డ్యామ్‌ భద్రత, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఒకేసారి డ్యామ్‌ అంతా నింపకూడదదని, అందువల్ల తొలిదశలో 41.15 మీటర్లకు నిల్వను పరిమితం చేస్తున్నామన్నారు. ఆ మార్గదర్శకాల ప్రకారం మూడు సంవత్సరాలలో నీళ్లు నింపుకుంటూ పోవాలన్నారు. అప్పుడు ఆర్‌ అండ్‌ ఆర్‌ చెల్లించడానికి కొంత సమయం వెసులుబాటు దొరుకుతుందని చెప్పారు. ఇప్పుడు తాము అడుగుతున్న రూ.15వేల కోట్లు పూర్తిగా డ్యామ్‌ ఎత్తు 45.7 మీటర్లు నిర్మించడానికి సరిపోతుందని, దాంతో పాటు 41.15 మీటర్ల వరకు పూర్తిగా ఎల్‌ఏ, ఆర్‌ అండ్‌ ఆర్‌ను కవర్‌ చేస్తుందన్నారు. దాని తర్వాత కనీసం మూడు సంవత్సరాలు డ్యామ్‌లో నీటిని నింపుకుంటూ…పూర్తి రిజర్వాయర్‌ స్థాయికి నిల్వ చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఆ డబ్బులు కేంద్రం తర్వాత ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుందన్నారు.
ఎవరైనా ఇదే పద్ధతిలో చేయాలని, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న అపోహలను నమ్మొద్దని జగన్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌, ఎల్‌ ఏ ఉన్నవాళ్లకు సంబంధించిన వివరాలు ఇస్తామన్నారు. మీరే డీబీటీ మీట నొక్కి నిర్వాసితులకు సాయమందించమని ఇప్పటికే కేంద్రానికి చెప్పామన్నారు. ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఆ హామీ ప్రకారం కేబినెట్‌లో తీర్మానం చేసి, జీవో కూడా ఇచ్చామని, 41.15 మీటర్లు వచ్చే లోపు…అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
దానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపడుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టు అని, దీనికోసం కేంద్రం నిధులిస్తుందని, వాటిని మనం సక్రమంగా వినియోగిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మనమే రూ.2600 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టామన్నారు. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నారు. పనులు ఆగిపోకూడదని, ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగాలని ఎల్‌ఏ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం మన డబ్బులు ఇచ్చామన్నారు.. వాటిని తెచ్చుకోవడం కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నామన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమవుతోందని, అయినా పనులు వేగంగా చేపట్టాలన్న తపన, తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.2600 కోట్లు ఇచ్చి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని సీఎం వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది తానేనని జగన్‌ చెప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img