Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలవరం పరుగులు

వరదలు, విపత్తుల్లోనూ ఆగని పనులు
ప్రభుత్వ లక్ష్యసాధన దిశగా ‘మేఘా’ కృషి
రేపు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
పోలవరం ప్రాజెక్ట్‌ సాకారం దిశగా అడుగులు వేస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డుస్థాయిలో పూర్తిచేసి సంచలనం సృష్టించిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ పోలవరం ప్రాజెక్టును కూడా అదేస్థాయిలో ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా అనుకున్న సమయానికి పనులు

పూర్తి చేసేందుకు రేయంబవళ్లూ కృషి చేస్తోంది. ఇందుకోసం వరదలు, విపత్తులను సైతం లెక్కచేయడం లేదు. రెండేళ్లుగా గోదావరికి భారీ వరదలు వస్తున్నా..కరోనా కలవరపెడుతున్నా ‘మేఘా’ ప్రత్యామ్నాయాలను అనుసరిస్తూ ప్రాజెక్ట్‌ పనుల వేగాన్ని తగ్గనివ్వడం లేదు. ఫలితంగా 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్‌ 5,58,073 ఘ.మీ కాంక్రీట్‌ పని పూర్తి చేసి సత్తా చాటింది. ముఖ్యంగా గతేడాది మే, జూన్‌, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్‌ పనులు నిర్వహించారు. గత మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్‌ మీటర్ల పనిని పూర్తి చేసింది. 2020 జూన్‌లో 70 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డుస్థాయిలో 1,20,100 క్యూబిక్‌ మీటర్లు పూర్తి చేసింది. 2021 ఫిబ్రవరిలో 47 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలని టార్గెట్‌ పెట్టుకుని 83 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు చేసింది. ఈ ఏడాది మార్చిలో 68,600 క్యూబిక్‌ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా 81,200 క్యూబిక్‌ మీటర్ల పనులు చేసి తన రికార్డును తానే అధిగమించింది. ఇలా ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్‌ పనులు చేస్తూ లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్‌ సాగుతోంది.
పూర్తి కావచ్చిన స్పిల్‌ వే పనులు
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ నిర్మాణం తుది రూపు దాల్చింది. కాంక్రీట్‌ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు మేఘా ఇంజనీరింగ్‌ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్‌ వేలో 2,98,034 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసింది. స్పిల్‌ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకుగాను 42 గేట్లు అమర్చారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్‌ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్‌ సిలిండర్లు అమర్చారు. 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. గేట్లను ఆపరేట్‌ చేయడానికి అవసరమైన మొత్తం 24 పవర్‌ ప్యాక్‌ సెట్లను అమర్చారు. వీటితో 48 గేట్లను ఒకేసారి ఎత్తవచ్చు. ఒక్కో పవర్‌ ప్యాక్‌ సాయంతో రెండు గేట్లను నిర్వహించవచ్చు. ఇప్పటికే 42గేట్లను ఎత్తి ఉంచి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వేలో మొత్తం 10 రివర్‌ స్లూయిజ్‌ గేట్ల అమరికతోపాటు వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్‌ సిలిండర్ల పనులు పూర్తయ్యాయి. వీటిని ఆపరేట్‌ చేయడానికి అమర్చే 10 పవర్‌ ప్యాక్‌లనూ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
రికార్డుస్థాయిలో అప్రోచ్‌ ఛానెల్‌, కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు
పోలవరం అప్రోచ్‌ ఛానెల్‌ మట్టితవ్వకం పనులు సైతం అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 116 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితవ్వకం పనులు చేయాల్సి ఉండగా కేవలం 60 రోజుల్లోనే దాదాపు 70లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసి గోదావరి నదికి అడ్డుకట్ట వేయడంతో అప్రోచ్‌ ఛానెల్‌ నుండి స్పిల్‌ వే మీదుగా స్పిల్‌ ఛానెల్‌లోకి గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ఇలా దాదాపు 6.6 కి.మీ గోదావరి నదిని ఎడమ వైపు నుండి కుడివైపు మళ్లించి ఇంజనీరింగ్‌ అద్భుతం సృష్టించింది. వరదలను సైతం తట్టుకొని స్పిల్‌ ఛానెల్లో ఇప్పటి వరకు 2,41,826 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో పాటు దాదాపు 33,39,809 క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇక పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులకు సంబంధించి దాదాపు 5,72,087 క్యూబిక్‌ మీటర్లు పూర్తయ్యాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తిస్థాయి ఎత్తు 42.5 మీటర్లకుగాను ఇప్పటికే దాదాపు 39 మీటర్లు నిర్మాణం పూర్తి అయింది. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పనులు 30మీటర్లకుగాను ఇప్పటికే దాదాపు 21మీటర్ల ఎత్తుకు చేరింది.
గ్యాప్‌-2 ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం పనులు
ప్రాజెక్ట్‌ గ్యాప్‌-2లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్‌ మీటర్ల వైబ్రోకాంపాక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా 1,61,310 క్యూబిక్‌ మీటర్ల శాండ్‌ ఫిల్లింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్‌ వే తో పాటు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం (గ్యాప్‌-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img