Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పోలవరం సమస్యలు పరిష్కారమయ్యేనా ?

5న పీపీఏ, కేంద్ర జలసంఘం, వివిధ రంగాల నిపుణుల భేటీ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : పోలవరం సమస్యలపై ఈ నెల 5వ తేదీ ప్రాజెక్టు క్షేత్రం వద్ద డ్యాం డిజైన్‌ సమీక్షా ప్యానెల్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రాజెక్టు అథారిటీ సభ్యులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు, జల విద్యుత్‌ పరిశోధన సంస్థ, మట్టి పరిశోధనా కేంద్రం, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఎస్‌ఈఆర్సీ), ఐఐటీ దిల్లీ, తిరుపతి నిపుణులు హాజరుకానున్నారు. వీరు శనివారం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి ఆదివారం సమావేశం కానున్నారు. దీంతో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్‌ భవితవ్యంతో పాటు, ఇతర సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు ఇప్పటికే వీలైనంత మేర డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చే పరీక్షలు పూర్తి చేశారు. వారు తమ నివేదికను తీసుకుని నేరుగా సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. వారి నివేదిక ఆధారంగా డయాఫ్రం వాల్‌ ధ్వంసమైనంత మేర నిర్మించడమా? లేక మళ్లీ కొత్తది పూర్తిగా నిర్మించడమా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. నదీ మార్గాన్ని స్పిల్‌వే వైపు మళ్లించేందుకు అప్రోచ్‌ ఛానల్‌ తవ్వుతున్నారు. ఈ పనులు ఇప్పటికే కొంతమేర పూర్తయ్యాయి. ఈ క్రమంలో అధ్యయనాలు, పరిశీలనలు తేల్చిన సాంకేతిక అంశాలపై చర్చిస్తారు. స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించి కొన్ని పిల్లర్లలో లోపాలున్నాయి. వాటిని సరిదిద్దేందుకు ఎస్‌ఈఆర్సీ కొన్ని సిఫార్సులు చేసింది. ఈ నివేదికలపై కూడా ఈ సమావేశం చర్చించి పరిష్కార మార్గం చూపనుంది. ఇక ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో భారీ వరదల కారణంగా నదీ గర్భంలో ఇసుక బాగా కోతకు గురైంది. దానిని పూడ్చి ఆ ప్రాంతంలో తిరిగి అదే గట్టిదనం తీసుకురావడానికి తీసుకున్న చర్యలపై కూడా ఈ సమావేశం చర్చించనుంది. మొత్తానికి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమస్యలకు 5న జరగబోయే వివిధ రంగాల నిపుణుల సమావేశం పరిష్కార మార్గాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img