Friday, April 19, 2024
Friday, April 19, 2024

పోలవరానికి కేంద్రం అన్యాయం

. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలి
. అఖిల పక్షాలను కలుపుకుని సీఎం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
. సీపీఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

విశాలాంధ్ర – విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అన్యాయం చేస్తోందని వక్తలు అన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఇక్కడి దాసరి భవన్‌లో ‘పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది’ అనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ఇతర ప్రజాసంఘాలను ఆహ్వానిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్‌ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.29,374 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారని అన్నారు. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,429 కోట్లు మాత్రమే మంజూరు చేస్తామని స్పష్టంగా చెబుతోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈ విషయంపై ఏమి మాట్లాడటం లేదని, ప్రస్తావన కూడా చేయటం లేదని, అన్ని పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం లేదని, కేవలం తనకు సంబంధించిన కేసులపై లాబీయింగ్‌ చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, లేదంటే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారుగా, చరిత్ర హీనులుగా నిలిచిపోతారని అన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత కర్నాటక ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని తెలిపారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. మొదటి దశ పేరుతో 45.72 మీటర్ల కాంటూరు నుంచి 41.15 మీటర్ల ఎత్తు తగ్గించాలనడంతో జాతీయ ప్రాజెక్టు పోలవరం మినీ ప్రాజెక్టుగా మారిపోతుందన్నారు. దీనివల్ల ప్రాజెక్టు నీటి నిల్వ 196.60 టీఎంసీల నుంచి 92 టీఎంసీలకు పరిమితం అవుతుందని తెలిపారు. ఇక రెండో దశ ప్రస్తావనే లేదని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించటంతో పాటు పరిశ్రమల అవసరాలకు నీటిని అందించగలుగుతామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా, ఎత్తును 135 అడుగులకు కుదించి, నిర్వాసితులకు ఇవ్వవలసిన రూ.30 వేల కోట్లను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించపోగా కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు రావలసిన నిధులను కేంద్ర కేబినెట్‌ ఆమోదించడం లేదని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి పదేపదే అన్యాయం చేస్తున్నా జగన్‌ నోరు విప్పట్లేదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ కేంద్రంలో విధ్వంస కారులు, రాష్ట్రంలో కక్షపూరిత దారులు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే ఎన్నికలే అజెండాగా, ఐక్య ఉద్యమాలతో సాధించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి నిర్మించాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెేవీవీ ప్రసాద్‌ వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, డేగా ప్రభాకర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, ప్రజా సంఘాల నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, డి.హరినాథ్‌, పోతుల బాలకోటయ్య, ఎస్‌.కె.ఖాదర్‌ బాషా, ఏపీపీఎఫ్‌ కన్వీనర్‌ నేతి మహేశ్వరరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కేవీబీ వీర వరప్రసాద్‌, ఏఐసీసీటీయూ నాయకులు ఈశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు కొలనుకొండ శివాజీ, కనకం శ్రీనివాసరావు, జి.ఎస్‌.ప్రసాద్‌, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, లోక్‌సత్తా నాయకులు వెంకటరమణ, పోలవరం ముంపు ప్రాంత నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, మైసాక్షి వెంకటాచారి, ఎండీ మునీర్‌, కారం ధరయ్య, బాడిస రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img