Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రజలా…దిల్లీ పెద్దలా?

రాజకీయ పార్టీలు ఎటువైపు?
. హోదా సాధించే వరకు పోరు
. ఉద్యమానికి కలిసి రండి
. విద్యార్థి, యువజనుల సాహసయాత్ర
. ప్రైవేటు బిల్లును నెగ్గించండి
. సమరయాత్రలో వామపక్ష నాయకుల డిమాండ్‌

విశాలాంధ్రఇచ్ఛాపురం: తెలుగు రాష్ట్రాన్ని అన్యాయంగా, ఇష్టానుసారం విభజించి, ప్రత్యేక హోదా కల్పిస్తామని నమ్మబలికి కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వామపక్షాలు, విభజన హామీల సాధన సమితి తీవ్రంగా విమర్శించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రత్యేక హోదావిభజన హామీల సాధన సమితి, విద్యార్థి, యువజన సంఘాలు హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ చేపట్టిన సమరయాత్ర (బస్సు యాత్ర) శనివారం ఇక్కడికి చేరుకుంది. యాత్రకు విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. పాత బస్టాండ్‌ కూడలి వద్ద స్వామి వివేకానంద, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హోదా సాధించడం చేతకాక పోతే ఆంధ్రా ఎంపీలు రాజీనామా చేయాలని ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు.
జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇచ్ఛాపురం ఎన్నో యాత్రలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందని, అధికారం కోసం యాత్రలు చేపట్టి ఇక్కడ ముగించుకొని స్థూపాలు కట్టించుకున్నారని, ప్రస్తుతం విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర ఏ అధికారం కోసమో కాదని, హక్కుల సాధనే ప్రధాన ధ్యేయమని స్పష్టంచేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడం, ప్రత్యేక హోదా సాధన, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి యాత్ర సాగించిన విద్యార్థి, యువజనుల కృషి గొప్పదని అభినందించారు. తిరుపతి సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశారని, కేంద్ర పాలకులు తెలుగు ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే భారీ కుట్రను అమలు చేస్తున్నారని, విశాఖ ఉక్కును దక్కించుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్రవాసులకు ఉందని అన్నారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటం వల్లనే అక్కడి కార్మికులకు న్యాయం జరుగుతుందని, ప్రైవేటుపరం చేస్తే రిజర్వేషన్లు లేక వెనుకబడిన తరగతులు నష్టపోతాయన్నారు.
బీజేపీతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసగిస్తున్నదని శ్రీనివాసరావు విమర్శించారు. 1935`36లో జమిందారీ వ్యవస్థను ఎదిరించి సాగిన రైతాంగ పోరాటంలో ఇచ్ఛాపురం పాత్ర కీలకమైందని అన్నారు. అన్ని విధాల అండగా ఉంటానని నమ్మించిన ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆయనను ఉత్తరాంధ్ర చీదరించుకుంటుందని చెప్పారు. ఏపీ ఎంపీలు, అధికార పక్ష నాయకులు హోదా ముగిసిన అధ్యాయమన్నట్లే వ్యవహరిస్తుండటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు పెడుతున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ఎంపీలు దాన్ని పార్లమెంట్‌లో నెగ్గించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీతో కలిసి డ్రామాలు అడుతున్నట్లేనని అన్నారు.
విద్యార్థి, యువజన సంఘాలు జాగృతమై రాష్ట్ర సంక్షేమం, విభజన హామీల సాధన కోసం పోరాటాలు చేస్తుంటే… రాజకీయ పార్టీలు కళ్లప్పగించి చూస్తున్నాయని, మీడియా తోడ్పాటు కూడా అంతంత మాత్రంగానే ఉందని, అయినా పోరాటం ఆగదని చలసాని శ్రీనివాసరావు అన్నారు. వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తేనే హక్కులు సాధించుకోగలమని చెప్పారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అని నినదించిన ముఖ్యమంత్రి…ఇప్పుడు దిల్లీ సింహాసనం ముందు మెడలు వంచుకున్నారని చెప్పారు. సమరయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని, చివరికి హైకోర్టు మెట్లెక్కితే తప్ప బస్సుయాత్రకు అనుమతి రాలేదని, శ్రీకాకుళంలోకి రాగానే ఆడపిల్లలను తరిమేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, పోలీస్‌ రాజ్యం నడుస్తున్నదని, అన్ని విధాల అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చాపర సుందర్‌లాల్‌, సీపీఐ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామమూర్తి, హోదా`విభజన హామీల సాధన సమితి జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్‌ బాబు, శివారెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భూషణం, భాస్కర్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు మొజ్జాడ యుగంధర్‌, షేక్‌ సుభానీ, జంగాల చైతన్య, లంక గోవిందరాజులు, లంకే సాయి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి, శ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు నాగభూషణం, నాసర్జీ, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img