Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజాస్వామ్యం ఖూనీ

జగన్‌ పాలనపై రామకృష్ణ ఆగ్రహం
నామినేషన్లు అడ్డుకోవడం దారుణమని విమర్శ
ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలని డిమాండ్‌

విశాలాంధ్ర`కడప కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఎంఎల్‌సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా పోలీసుల ద్వారా అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఎంఎల్‌సీ ఎన్నికల్లో పోటీకి చాలామంది ఆసక్తి ప్రదర్శించారని, అలాంటి వారిని నామినేషన్‌ వేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను పోటీలో లేకుండా చేయడం దుర్మార్గమని చెప్పారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే పోటీ చేయాలని, ఇవి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌ వంటివని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెబుతున్నారన్నారు. అభ్యర్థులు మారువేషాలలో వెళ్లి నామినేషన్లు వేయాల్సిన దుస్థితి వచ్చిందని, ఇందుకు సీఎంగా జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏకగ్రీవం కోసం అభ్యర్థులను ప్రతిపాదించిన వ్యక్తులను బెదిరించారని, ఆ సంతకాలు ఫోర్జరీవని వారితోనే చెప్పించారని రామకృష్ణ గుర్తుచేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సీ అభ్యర్థులుగా ఏ రాజకీయ పార్టీ గతంలో పోటీకి దించలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఆ సంప్రదాయం పాటించారన్నారు. జగన్‌ మాత్రమే పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దించారని విమర్శించారు. స్వయంగా మంత్రులు రంగంలోకి దిగి…పట్టభద్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి రూ.2 వేలు, రూ.5 వేలు పంచుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అఘాయిత్యాలను అడ్డుకోవడానికి డాక్టర్లు, ఇంజినీర్లు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంఎల్‌సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులకు ఓటువేయాలని, జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండుఉపాధ్యాయ నియోజవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సీపీఐ పాదయాత్రకు ఉపక్రమించడం వల్లే సీఎం జగన్‌ ఆఘమేఘాల మీద జిందాల్‌ కంపెనీతో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయించారని రామకృష్ణ అన్నారు. ఉక్కు పరిశ్రమకు ఇప్పటికి నాలుగుసార్లు శంకుస్థాపనకులు చేశారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఒక్కోసారి శంకుస్థాపన చేయగా జగన్‌ ఏకంగా రెండుసార్లు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పరిశ్రమ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వాటిని పునాదిరాళ్లకే పరిమితం చేయవద్దని సూచించారు. కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేసిన తర్వాతే జగన్‌ ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్నా దోషులు ఎవరనేది రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ ఇప్పటికీ తేల్చకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌ బాబు, కార్యదర్శి శివారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి వెంకటశివ, నాయకులు నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, ఆంజనేయులు, చంద్రశేఖర్‌, వేణుగోపాల్‌, మద్దిలేటి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img