Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతిపక్షంలో సమరోత్సాహం

సాగు చట్టాలపై ‘మోదీ’ యూటర్న్‌ విపక్షానికి లాభమేనా
రైతు నిరసనలతో కేంద్ర సర్కార్‌కు ఎదురుదెబ్బ

న్యూదిల్లీ : పాలకుల ప్రజావ్యతిరేక చర్యలు ఎంతోకాలం సాగబోవని చరిత్ర చెబుతూనే ఉంది. సంస్కరణలకు, కార్పొరేట్‌కు బాటలు వేస్తూ కార్మికులు, కర్షకులపై అణచివేత వైఖరిని అవలంభించే వారికి ఎదురుదెబ్బ తప్పదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభ్యున్నతికి, వారి ఆకాంక్షలకు భిన్నంగా చేపట్టే ఎటువంటి చట్టాలైనా రద్దుకాక తప్పదన్న విషయం మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన నిరసనోద్యమం స్పష్టం చేసింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ఏకపక్షంగా నియంతృత్వ వైఖరితో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి మూడు సాగు చట్టాలను తీసుకువచ్చింది. ఆ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా 40కి పైగా రైతు సంఘాల అధ్వర్యంలో రైతులు పట్టువిడవకుండా మొక్కవోని దీక్షతో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో రైతుల చారిత్రక ఉద్యమం ప్రభావం ఇటీవల అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడిరది. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ బీజేపీ కంగుతినేలా ఫలితాలు వచ్చాయి. దీంతో రైతుల ఉద్యమం తమ అధికారాన్ని కూలదోస్తుందని, రాజకీయంగా సమాధి చేస్తుందని భావించిన బీజేపీ పాలకులు ఎట్టకేలకు మూడు సాగు చట్టాలను రద్దు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెబుతూ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిరంతర నిరసనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్య అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన అతిపెద్ద పాలసీ యూ-టర్న్‌. కీలకమైన రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇది తన ప్రత్యర్థులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఈ చర్య వల్ల చివరకు ప్రయోజనం పొందగలరా అనేది ప్రశ్న. అయితే చీలిపోయిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు అధికార బీజేపీ తప్పుడు చర్యలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. గత నెలలో ఉత్తర ప్రదేశ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతుల పైకి కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనాన్ని ఎక్కించి ఎనిమిది మంది మృతికి కారణమయ్యాడు. ఈ సమయంలోనూ విపక్షాల మధ్య విభజన స్పష్టంగా కనిపించింది. ఆ సంఘటనా స్థలానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మొదట చేరుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కీలక ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాని మోదీ ఇతర ప్రత్యర్థులు కూడా రంగంలోకి దిగారు. అయితే వీరంతా ఒక్కటిగా కాకుండా విడివిడిగా ర్యాలీలు నిర్వహించారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఈ పోటీ రాజకీయ సంఘటనలే. మతతత్వ బీజేపీకి వ్యతిరేకించే ఓట్లను సమర్థవంతంగా పొందడంలో, ఆ విషయంలో పరస్పరం సహకరించుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని టికునియాలో హింసాకాండ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న రాష్ట్రానికి చెందిన రైతు బల్జీత్‌ సింగ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశాడు. అయితే తాను ఇప్పుడు భిన్న వైఖరి తీసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేస్తానని ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని మోదీకి కాకుండా మరెవరికైనా మద్దతు ఇస్తానని స్పష్టం చేశాడు. కానీ ఏ పార్టీకి ఓటు వేస్తానన్న విషయాన్ని మాత్రం వెల్లడిరచలేదు. ‘నేను వేర్వేరు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నాను. వారిలో ఒకరికి నా ఓటు వేస్తాను. బీజేపీకి మాత్రం కాదు’ అని సింగ్‌ చెప్పారు.
ఇదిలాఉండగా, ప్రధాని మోదీ శుక్రవారం సాగు చట్టాల రద్దు ప్రకటన చేయడానికి ముందు, ఆయన పార్టీ బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోయింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే దీమాతో ఉంది. అత్యధిక జనాభా కలిగి ఉన్న ఈ రాష్ట్రం 2024లో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జాతీయ భావనకు కీలక సూచికగా పరిగణించబడుతోంది. బీజేపీ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 77 శాతం సీట్లను గెలుచుకుంది. అయితే రైతు నిరసనల్లో కీలకంగా ఉన్న పంజాబ్‌లో బీజేపీ ఒపీనియన్‌ పోల్స్‌లో వెనుకంజలో ఉంది. ఈ క్రమంలో దేశం సిక్కు విశ్వాస స్థాపకుడి జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెబుతూ సాగు చట్టాల రద్దును ప్రకటించారు. భోపాల్‌లోని జాగ్రన్‌ లేక్‌సిటీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ సందీప్‌ శాస్త్రి మాట్లాడుతూ ‘వచ్చే ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు చికాకు పెట్టబోతున్నాయని స్పష్టంగా అర్థమైంది’ అని అన్నారు.
ప్రతిపక్షంలో జడత్వం..
అయితే ప్రతిపక్ష పార్టీల్లో జడత్వం నెలకొంది. ప్రధాని మోదీ సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘దేశానికి తిండి పెట్టే వారు అహంకారాన్ని శాంతియుతంగా ఓడిరచారు’ అని ట్వీట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా సాగు చట్టాల రద్దు ప్రకటనను రైతుల విజయంగా పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. అయితే 28 రాష్ట్రాలలో 17 రాష్ట్రాలను నియంత్రించి, పార్లమెంటు దిగువ సభలో మెజార్టీ కలిగి ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పని చేయడం ప్రారంభిస్తారనే సంకేతాలు ఏ ప్రతిపక్ష పార్టీల నుండి లేవు. కాంగ్రెస్‌ పార్టీ ఏకైక జాతీయ ప్రతిపక్షం, మిగిలినవి వివిధ ప్రాంతీయ, కుల ఆధారిత రాజకీయ పార్టీలుగా చీలిపోయాయి. గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి నెలకొంది. గత నెలలో పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయాలను ‘సీరియస్‌గా’ తీసుకోలేదని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. గత నెలలో బీహార్‌లో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ పొత్తును తెంచుకున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలలో రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి చేతిలో ఓడిపోయారు. అటుతర్వాత, లాలూ యాదవ్‌ మాట్లాడుతూ బీజేపీని ఓడిరచేందుకు ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌ అధ్వర్యంలో ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాగా దేశ జనాభాలో 60 శాతం మంది ఏదో ఒక విధంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. రైతులు తమ పంటలన్నింటికీ కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) హామీని కోరుతున్నారు. అయితే ప్రధాని మోదీ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా తమ నిరసనలు కొనసాగుతాయని రైతు నాయకుడు ఒకరు స్పష్టం చేశారు. ‘ఇది ప్రధాన మంత్రి తీసుకున్న మంచి చర్య. అయితే ఇది చాలా ముందుగానే చేయాల్సి ఉంది’ అని దిల్లీ సరిహద్దులో నిరసనల్లో పాల్గొన్న పంజాబ్‌కు చెందిన రైతు బల్వీందర్‌ సింగ్‌ అన్నారు. ‘ఆయనకు చట్టాలను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. గత ఏడాది కాలంలో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయకుండా చట్టాలను రద్దు చేసి ఉంటే బహుశా మేము ఆయనకు ఓటు వేసి ఉండేవాళ్లం’ అని రైతు తెలిపారు. కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌లో దక్షిణాసియా ప్రోగ్రామ్‌లో డైరెక్టర్‌, సీనియర్‌ ఫెలో మిలన్‌ వైష్ణవ్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన సమస్య ఏమిటంటే, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాకుండా వారు దేని కోసం నిలబడతారో గుర్తించడం అని అన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అంటే స్థిరమైన, నిశ్చయాత్మక అంశాలను కలిగి ఉన్న ప్రచారం. మరో మాటలో చెప్పాలంటే, ప్రతిపక్ష పార్టీలు కేవలం అధికార పార్టీని విమర్శించడమే కాకుండా ప్రత్యామ్నాయ దృక్పథం ద్వారా ఏదైనా సానుకూలతను అందించడం’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img