Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రత్యేక హోదాపై మళ్లీ పాతపాటే

ముగిసిన అధ్యాయమేనంటూ తేల్చిచెప్పిన కేంద్రం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే పాడిరది. పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాన్ని నిస్సిగ్గుగా అది ఇవ్వలేమని తెగేసి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపుపై వైసీపీ పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనంటూ స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గతంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడిరచారు. రాష్ట్రాల ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని ఆయన వివరించారు. దీనివల్ల ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, లేని ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. అందుకే ప్రత్యేక హోదా బదులుగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామన్నారు. 2015 నుంచి 2018 వరకు ఈఏపీ పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని కూడా చెల్లించినట్లు తెలిపారు. మొత్తం ఈ ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడిరచారు.
మొక్కుబడిగా ప్రశ్నిస్తున్న వైసీపీ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను ఎక్కువ మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 2019 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, గత నాలుగు సంవత్సరాలుగా ఆ అంశాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడల్లా వినతిపత్రం ఇవ్వడం, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల్లో దీనిపై ప్రశ్న వేసి చేతులు దులుపుకోవడం తప్ప, ఇందుకోసం కేంద్రంపై కనీస ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఉభయ సభల్లో వైసీపీకి సుమారు 31 మంది ఎంపీలున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలకు ఆమోదముద్ర వేయడానికి తప్ప, రాష్ట్ర ప్రయోజనా లకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. చివరికి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు సైతం వైసీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. విభజన అంశాల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img