Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచండి

పంజాబ్‌ పర్యటనలో భద్రతాలోపం ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశం
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్‌, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సూచించింది. ఈ విషయంలో పంజాబ్‌ పోలీసు, ఎస్‌పీజీ, ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహకరించాలని వెల్లడిరచింది. పీఎం పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణ సందర్భంగా శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కేంద్ర, పంజాబ్‌ ప్రభుత్వం తమ వాదనలు వినిపించాయి. ఈ భద్రతా వైఫల్యమనేది అరుదైన కేసని, ఇది అంతర్జాతీయంగా ఇబ్బంది కలిగించే అంశమని కేంద్రం కోర్టుకు వెల్లడిరచింది. అలాగే ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలంటూ పిటిషనర్‌ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా వాదించింది.
అత్యున్నత న్యాయస్థానం ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు అప్పగించింది. రిజిస్ట్రార్‌ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్‌ పోలీసులు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. రిజిస్ట్రార్‌ జనరల్‌తో సమన్వయం కోసం చండీగఢ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి ఒకరు నోడల్‌ ఆఫీసర్లుగా పని చేయాలని తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ కార్యకలాపాలను సోమవారం (జనవరి 10) వరకు నిలిపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మౌఖికంగా జారీ చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. లాయర్స్‌ వాయిస్‌ దాఖలు చేసిన పిల్‌పై తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img