Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ వినలేదని
36 మంది నర్సింగ్‌ విద్యార్థులకు శిక్ష

వారంరోజులు ఔటింగ్‌ నిషేధం
చండీగఢ్‌ పీజీఐఎంఈఆర్‌లో ఘటన

చండీగఢ్‌: ప్రధాని నరేంద్రమోదీ రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ 100వ ఎపిసోడ్‌ విననందుకు 36 మంది నర్సింగ్‌ విద్యార్థులను కాలేజి యాజమాన్యం శిక్షించిన ఘటన చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో జరిగింది. మహిళా విద్యార్థులను వారం పాటు హోస్టల్‌ నుంచి బయటకు రానివ్వకుండా నిషేధించింది. ఏప్రిల్‌ 30న మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ ప్రసారం కాగా విద్యార్థులపై ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం చర్యలు తీసుకోవడం ఆలశ్యంగా (మే 10న) వెలుగులోకి వచ్చింది. కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రసారానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిని పీజీఐఎంఈఆర్‌ నిరాకరించలేదు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ఎనిమిది మంది మొదటి సంవత్సరం, 28 మంది మంది తృతీయ సంవత్సరం చదివే నర్సింగ్‌ విద్యార్థులు డుమ్మా కొట్టారు. దీంతో వారిపై హాస్టల్‌ వార్డెన్‌ ఫిర్యాదు మేరకు ‘ఔటింగ్‌’ లేకుండా శిక్షించారు. అయితే ఈ మేరకు చర్యలు ఉంటాయని విద్యార్థులను ముందే హెచ్చరించినట్లు వార్డెన్‌ చెప్పారు. ఏప్రిల్‌ 29వ తేదీ రాత్రి, 30వ తేదీ ఉదయం కూడా తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పినప్పటికీ 36 మంది గైర్హాజరాయ్యరన్నారు. దీంతో డుమ్మా కొట్టిన విద్యార్థులకు శిక్షగా వారం పాటు బయటకు వెళ్లకుండా నిషేధిస్తూ ఈనెల 3న కాలేజి ఇంచార్జి ఉత్తర్వులిచ్చారు.
నర్సింగ్‌ విద్యార్థి సంఘాల ఖండన
ఒక రాజకీయ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావలని ఆదేశాలివ్వడమే కాకుండా గైర్హాజరు అయినందుకు విద్యార్థులను శిక్షించడం ఆక్షేపణీయమని నర్సింగ్‌ విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఇదే క్రమంలో పీజీఐ నర్సుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు మంజ్‌నీక్‌ మాట్లాడుతూ ఇలా శిక్షలు విధించడం విద్యార్థుల స్వేచ్ఛాహక్కును అతిక్రమించడమే అని అన్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమమేమీ అకడమిక్‌ లెక్చర్‌ లేక సెమినార్‌ కాదని, దీనికి విద్యార్థులంతా హాజరు కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ్ల ముఖ్యమైన సెమినార్లు, లెక్చర్లకు డుమ్మా కొట్టినా శిక్షించే పద్ధతి లేదన్నారు. మన్‌ కీ బాత్‌ ఓ రాజకీయ కార్యక్రమమని, తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఇనిస్టిట్యూట్‌ ఆదేశాలివ్వడం తప్పు అని, హాజరుకాలేదన్న నెపంతో విద్యార్థులను శిక్షించడం ఇంకా పెద్దతప్పు అని అన్నారు.
వీరు పాలకులకు తొత్తులా!
కాలేజి యాజమాన్యాలు పాలకులకు తొత్తులా అంటూ దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వనంద్‌ అసహనం వ్యక్తంచేశారు. ‘కొన్ని యాజమాన్యాలు సిగ్గులేకుండా పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. దీనిని ఇలానే వదిలేయడం మంచిది కాదని సూచించారు.
క్రమశిక్షణ నేర్పుందుకే…
తమ ఇనిస్టిట్యూట్‌లో క్రమశిక్షణ పాటించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామనిపీజీఐఎంఈఆర్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుఖ్‌పాల్‌ కౌర్‌ అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పేందుకు అప్పుడప్పుడు ఇటువంటి చర్యలు తప్పవని అన్నారు. మన్‌ కీ బాత్‌కు హాజరు కావాలని చెప్పినప్పుడు వారు హాజరు కావాల్సిందేనని, డుమ్మా కొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇది చిన్న విషయమని, అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని పీజీఐఎంఈఆర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొట్టిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కొత్తేమీ కాదని, ప్రధానిదీ అధికారిక కార్యక్రమేనన్నారు.
తప్పు ఒప్పుకున్న యాజమాన్యం
‘ఈ విషయంలో కాలేజి యాజమాన్యం కాస్త అతిగానే వ్యవహరించిందని ఒప్పుకుంటున్నామని పీజీఐఎంఈఆర్‌ యంత్రాంగం పేర్కొంది. సంబంధిత అధికారులను వారించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయొద్దని కోరింది. తమ ఇనిస్టిట్యూట్‌లలో గెస్ట్‌ లెక్చర్లు, చర్చలు జరుగుతుంటాయని, నిపుణులైన వక్తలు పాల్గొంటారని, ఇందులో భాగంగానే మన్‌ కీ బాత్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచింది. అంతకుముందు ఎపిసోడ్‌లో పీజీఐఎంఈఆర్‌ ద్వారా అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబంతో మోదీ మాట్లాడారని, అవయవదానాన్ని ప్రోత్సహించారని తెలిపింది. ఇటువంటివి వింటే విద్యార్థులకు మంచిదని భావించే మన్‌ కీ బాత్‌ ప్రసారం చేసినట్లు పేర్కొంది. ఈ అంశాన్ని పెద్దది చేయొద్దని కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img