Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచానికి ఆహారం అందిస్తాం

బైడెన్‌కు చెప్పా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఒప్పందం అంగీకరిస్తే..ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెప్పినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆహార నిల్వలు నిండుకున్నాయని మోదీ చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలో గల అదలాజ్‌లో శ్రీ అన్నపూర్ణ ధామ్‌ ట్రస్టుకు చెందిన బాలుర హాస్టల్‌ను, విద్యా కాంప్లెక్స్‌ను మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కోవిడ్‌19 మహమ్మారి కారణంగా రెండేళ్లుగా దేశంలోని 80 కోట్లమందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నామని, ఈ విషయం తెలుసుకొని ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయని మోదీ చెప్పారు. నేడు ఎవరికి ఏమి కావాలో తెలియని అనిశ్చితి పరిస్థితిని ప్రపంచం ఎదుర్కొంటున్నదని చెప్పారు. అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో పెట్రోలు, చమురు, ఎరువుల సేకరణ కష్టంగా మారిందని, రష్యాఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావడంతో అన్ని దేశాలు తమ నిల్వలను దాచిపెట్టుకుంటున్నాయని వివరించారు. ‘ప్రపంచం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రపంచంలో ఆహార నిల్వలు ఖాళీ అయ్యాయి. నేను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఈ విషయం ప్రస్తావించారు. డబ్ల్యూటీఓ అనుమతిస్తే రేపటి నుంచే ప్రపంచానికి ఆహార నిల్వలు అందజేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పాను’ అని మోదీ తెలిపారు. ‘మా ప్రజలకు కావాల్సినన్ని ఆహార పదార్థాలు మా దగ్గర ఉన్నాయి. ప్రపంచానికే ఆహారం పెట్టగలిగే శక్తిసామర్ధ్యాలు మా అన్నదాతలకు ఉంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రపంచ చట్టాలకు అనుగుణంగా మేము పనిచేయాల్సి ఉంది. డబ్ల్యూటీఓ మాకు అనుమతిస్తుందో లేదో మాకు తెలియదు. అది జరిగితే ప్రపంచానికే మేము ఆహారం సరఫరా చేస్తాం’ అని మోదీ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img