Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రభుత్వం, పాలనపై అఫ్గాన్లదే నిర్ణయం

భారత్‌ ఆచితూచి అడుగు
తాలిబన్ల పాలనతో ప్రపంచానికే ముప్పు
ఐక్యతతో మోదీ సర్కారును గద్దె దించాలి
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

హైదరాబాద్‌ : అఫ్గానిస్థాన్‌లో అక్కడి ప్రజలు కేంద్రంగా రాజకీయ ప్రక్రియ ఉండాలని, ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి విధానాలు కావాలో అఫ్గ్గాన్లే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టంచేశారు. ప్రజలకు రాజ్యాంగ, మానవ హక్కులు ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇస్లామిక్‌ చట్టాలకు అనుగుణంగా మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పిస్తామని తాలిబాన్‌ చెబుతు న్నప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నదని, అక్కడ ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నదని రాజా వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలని, అమెరికా చెప్పుచేతల్లో కాకుండా స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించాలని సూచించారు. అపోహలకు తావివ్వకుండా

పొరుగు దేశాలు, పశ్చిమ, దక్షిణ ఆసియా దేశాలతో చర్చలు జరపాలన్నారు. హైదరాబాద్‌ మగ్దూంభవన్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతో కలిసి బుధవారం రాజా విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. తాలిబాన్లు కాబూల్‌ సహా అఫ్గాని స్థాన్‌ను తమ అధీనంలోకి తీసుకోవడం భారత్‌ సహా అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అక్కడ తలెత్తిన పరిస్థితులపై కేవలం పశ్చిమ దేశాలే కాకుండా అన్ని దేశాలు అర్థవంతమైన చర్చల ద్వారానే పరిష్కారమార్గం కనుగొనాల్సి ఉన్నదని రాజా పేర్కొన్నారు. షేక్‌ నజీబుల్లా 1986 నుండి 92 వరకు పరిపాలించిన తరువాత అమెరికా అక్కడి రాజకీయాల్లోకి అడుగుపెట్టిందని, కేవలం పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసమే అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నదన్నారు. అక్కడి ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను ఎలా నిర్వీర్యం చేసిందో అందరం చూశామని, చివరకు అమెరికా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నదని చెప్పారు. అఫ్గానిస్థాన్‌లో చాలా మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతను, తిరిగి తీసుకువచ్చే అంశంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని రాజా విజ్ఞప్తి చేశారు. అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీతో ప్రధాని భేటీ అయ్యారని, ఆ సమావేశంలో ఏమి జరిగిందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో బైటికి రాలేదని, అయితే భారత దేశం స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రష్యా, చైనా, పాకిస్థాన్‌ తాలి బాన్లతో చర్చలు జరుపుతున్నారని, ఇరాన్‌, టర్కీ ఏమి చేస్తుందో చూడాలన్నారు. అఫ్గానిస్థాన్‌ అంశం కేవలం పశ్చిమాసియా దేశాలపైనే కాకుండా ప్రపంచ సమతుల్యతపైనా ప్రభావం చూపుతుందన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని ఐక్యంగా గద్దె దించాలి
ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో మోదీ సర్కారు నియంతృత్వ ఫాసిస్టు ఎజెండాను అమలు చేస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నదని డి.రాజా విమర్శిం చారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైనదని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటును నిష్ప్రయోజనకరంగా మార్చేసిందని, వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి చర్చలేకుండానే కావాల్సిన బిల్లులను ఆమోదింప జేసుకున్నదన్నారు. ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, ఉద్యమ కారుల ఫోన్లు టాప్‌ చేసిన పెగాసెస్‌ వంటి కీలకమైన జాతీయ అంశంపై కనీసం చర్చ జరపలేదని, మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను వెనక్కితీసుకోవాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ పట్టించుకోలేదన్నారు. మోదీ ప్రభు త్వం మొండిగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు కాకుండా ప్రభుత్వమే సజావుగా సాగనీయలేదని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల తాము ఆశావహంగా ఉన్నామని రాజా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు సభలో ఐక్యంగా పోరాడాయని, వెలుపల కూడా శరద్‌పవార్‌, కపిల్‌ సిబల్‌ ప్రతిపక్షాలతో సమావేశమై ఐక్యత కోసం ప్రయత్నాలు చేశారన్నారు. వాటిలో గతంలో ఎన్‌డీఏ భాగస్వాములుగా ఉన్న అకాళీదళ్‌, టీడీపీలు కూడా పాల్గొన్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీన ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. కేవలం మత ఉద్రిక్త తలు రెచ్చగొట్టేందుకు ఆగస్టు 14ను ‘విభజన అకృత్యాల స్మరణ’ దినంగా పాటించాలని ప్రధాని మోదీ కోరారని విమర్శించారు. నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, హిందూ మహాసభల పాత్ర ఏమిటని ప్రశ్నిం చారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదని, నిరుద్యోగం పెరిగిపోతున్నదని, ఇవేవీ మోదీకి పట్టవని, కేవలం తన వాగాడంబరంతో ఎప్పటికప్పుడు కొత్త పదాలతో ప్రజలను మభ్యపెట్టడం ఒక్కటే ఆయనకు తెలుసునని రాజా విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అసమ్మతి వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఒకటని, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహం కేసులు పెడుతూ దేశద్రోహులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. తక్షణమే ఐపీసీ 124(ఎ) (రాజద్రోహం) సెక్షన్‌ను తొలగించాలని రాజా డిమాండ్‌ చేశారు.
పథకాలపై ప్రచారమే ఎక్కువ : చాడ
కేసీఆర్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రచారం ఎక్కువ, అమలు తక్కువగా ఉన్నదని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మొత్తం 2.95 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరైతే 1.70 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని, అంటే సగం పూర్తి కాలేదన్నారు. దళిత బంధుకు రూ.1.70లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇది మొత్తం బడ్జెట్‌ కంటే ఎక్కువని చెప్పారు. సంక్షేమ పథకాలను ఎరగా చూపి ఓట్లు దండుకునేందుకే కేసీఆర్‌ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శిం చారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను అదానీ బెదిరించి లాగేసుకుంటున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే సాధ్యమని నారాయణ అన్నారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ అన్నాహజారే ఉద్యమం సందర్భంగా పార్లమెంటును నడవనీయకుండా చేసిన వెంకయ్యనాయుడు, నేడు సభను ప్రతిపక్షాలు నడవనీయడం లేదనడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img