Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వ ఎత్తుగడే

సమస్యల పక్కదారికి వ్యూహం
ఉద్యోగ సంఘాల్లో చీలిక
ఏపీఎన్జీవో వర్సెస్‌ ఏపీ ఉద్యోగుల సంఘం
బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ పరస్పర విమర్శలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలికకు జగన్‌ సర్కారు ఎత్తుగడల పరంపర కొనసాగిస్తోంది. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకుండా, పైపెచ్చూ వారి మధ్య విభేదాల్ని సృష్టిస్తూ, సమస్యల పక్కదారికి ఒడిగట్టింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అసలు సమస్యల్ని పక్కనపెట్టి… ప్రభుత్వ వ్యూహంలో పడిపోయి ఒకొర్నొకరు దుమ్మెత్తి పోసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు పరస్పర మాటల యుద్ధం, దూషణల దాడి ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఉద్యోగ సంఘాల్లో ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణం రావడం వెనుక ప్రభుత్వం వ్యూహం ఉందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇది కచ్చితంగా జగన్‌ సర్కారు అవలంభిస్తున్న ఎత్తుగడేనని, ఉద్యోగ సంఘాల్లో చీలికకు కుట్రపన్నిందని ప్రతిపక్ష, కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం పరిష్కరించకుండా విమర్శలకు గురిచేస్తోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఈనెల 19న గవర్నరును ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. అదేరోజు సీఎం జగన్‌ను నూతనంగా ఎన్నికయిన ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికయిన ప్యానల్‌ సభ్యులను సీఎంకు ఆయన పరిచయం చేశారు. గవర్నరుతోను, సీఎంతోను వేర్వేరుగా ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీఎన్జీవో సంఘం ప్రభుత్వానికి అనుకూలంగాను, ఏపీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకంగానూ అనే సందేశం ఉద్యోగుల్లోకి వెళ్లింది. ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని, వారికి ఒకటో తేదీన వేతనాలు అందుకోవడం గగనంగా మారిందని విన్నవించారు.
ఆది నుంచి జగన్‌ వివక్ష
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జగన్‌ సర్కారు మొదటి నుంచి మొండిగా వ్యవహరిస్తోంది. ఆయా ఉద్యోగ సంఘాల నేతలైన బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ వేర్వేరుగా మీడియాల సమావేశాల్ని నిర్వహించి, పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మరోమారు ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. సూర్యనారాయణకు దమ్ముంటే తక్షణమే సమ్మెకు దిగాలని, ఆ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు లేదని బండి సవాల్‌ విసిరారు. దానిపై సూర్యనారాయణ వెనక్కి తగ్గకుండా దీటుగా విమర్శలు చేస్తూ… తాము సమ్మెకు వెళతామని చెప్పలేదని, నిబంధనల ప్రకారమే తమకు గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. మొత్తం మీద ఉద్యోగ సంఘాల మధ్య జగన్‌ సర్కారు చిచ్చురేపి పైశాచిక ఆనందంతో పొందుతోంది.
వేతనాల కోసం గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి
ఉద్యోగులు జీతాల కోసం గవర్నర్‌ను కలవడం అనేది దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారిగా ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పరిమితికి మించి అప్పులు చేయడంతోనే ఈ దుస్థితి ఏర్పడిరది. అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి లేదు. దీంతోనే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాలకు ఆటంకం నెలకొంటోంది. పండుగలకు సైతం ఉద్యోగులు సక్రమంగా వేతనాలు తీసుకునే పరిస్థితుల్లేవు. వారికి న్యాయపరంగా రావాల్సిన ప్రయోజనాలపైనా జాప్యం చేస్తోంది. ఉద్యోగుల పీఎఫ్‌ రుణాల నుంచి పదవీ విరమణ చేశాక వారి ప్రయోజనాలనూ సక్రమంగా ఇవ్వడం లేదు. జనవరి జీతాలు ఫిబ్రవరిలోనూ ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రూ.7 వేల కోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. గతంలో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్‌ అడ్వాన్సులు కూడా ఇవ్వకుండా దాట వేసింది. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులంతా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దానిని పక్కదారి పట్టించేందుకే… ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చిందన్న విమర్శలున్నాయి. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ అమలు చేయలేదు. జగన్‌ ప్రభుత్వ ఆర్థిక విధానాలే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నానికి కారణంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నేతలు ఐక్యంగా నిలిచి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.
సీఎం రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
ఉద్యోగులు జీతాల కోసం గవర్నర్‌ని కలవడం అనేది దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి అని, అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉంటే, సీఎం జగన్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ సంఘం నేత రాష్ట్ర గవర్నర్‌ని కలవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందనడానికి నిదర్శనమని చెప్పారు. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ ఇప్పించాలని ఉద్యోగ సంఘాలు గవర్నర్‌ని కోరాయని, ఉద్యోగ సంఘాలు గవర్నర్‌ని కలవడం అనేది సాధారణమేనని తెలిపారు. చెదపట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైందంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img