Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రయాణ పాట్లు

. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ
. కిలోమీటర్ల పొడవునా వాహనాలు
. సంక్రాంతి ప్రభావం… ఏపీకి జనం పరుగులు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: సంక్రాంతి పండుగ ప్రయాణం అసహనంగా మారింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో శుక్రవారం కూడా వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. ఈ రద్దీ నడుమ ప్రయాణం సొంతూళ్లకు వెళ్లే వారికి భారంగా మారింది. సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి కార్ల ద్వారా కుటుంబ సమేతంగా తరలిరావడంతో ఈ రద్దీ సమస్య తలెత్తింది. అడుగడుగునా వాహనాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉన్నాయి. పండుగ సందర్భంగా రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ… ట్రాఫిక్‌ నియంత్రణలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో, హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, విఐపీలు ప్రతిఏటా ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసి సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావడం ఆనవాయితీ. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తరలివచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ గేట్‌ వద్ద, కీసర టోల్‌ గేట్‌ వద్ద దాదాపు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కుని నానా ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, చిన్నారులు అసౌకర్యం చెందారు. ట్రాఫిక్‌ దిగ్బంధంలో ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి ఏర్పడిరది. ఏకంగా కార్లలోనే ఏసీలు వేసుకుని కాలం వెలబుచ్చారు. ఒకేసారిగా వాహనాలు పెద్దఎత్తున తరలిరావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ, చాలా వాహనాల ఫాస్టాగ్‌ స్కానింగ్‌ కానందున కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోతున్నట్లు టోల్‌ ప్లాజా నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ వాహనాల క్రమబద్దీకరణకు సమీప పోలీసులు చర్యలకు నిమగ్నమయ్యారు.
ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలని…
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత సంక్రాంతి పండుగను పూర్తి స్థాయిలో జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి అధికంగా ప్రజలు పల్లెబాట పట్టారు. చెన్నై, బెంగళూరు నుంచి కూడా కార్లలో వస్తున్నారు. మూడు నెలల ముందే రైలు, బస్సు ప్రయాణాలకు టికెట్లు రిజర్వేషన్‌ కావడంతో మధ్యతరగతి వర్గాలు సైతం ఎలాగైనా తమ ఊళ్లకు వెళ్లాలనే తపనతో ప్రైవేట్‌ కార్లతో తరలివస్తున్నారు. దీనిని అదునుగా తీసుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌, కార్ల నిర్వాహకులు పెద్దత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేట్‌ బస్సుల్లో నాలుగు రెట్ల ధరలు వసూలు చేస్తున్నారు. విజయవాడ బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. ఈ ప్రభావం విజయవాడ నగరంపై పూర్తిగా పడిరది. విజయవాడలోని బందరురోడ్డు, ఏలూరురోడ్డుపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడిరది. వివిధ ప్రాంతాల నుంచి నగరం మీదుగా కార్లు వెళ్లడంతో రద్దీ ఏర్పడిరది. బెంజిసర్కిల్‌, రామవరప్పాడు రింగ్‌ ప్రాంతంలోనూ వాహనాలు బారులుతీరి నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. వివిధ డిపోలకు చెందిన సిటీ సర్వీసులను ప్రత్యేక బస్సులుగా మార్పు చేసి, వాటిని నడపడంతో నగరవాసులకు కొరత ఏర్పడిరది. వివిధ మార్గాల్లో నిత్యం తిరిగే బస్సులను ఆర్టీసీ కుదించివేసింది. శనివారం నాడూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి కైనా ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img