Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రశ్నిస్తే దేశద్రోహులా..?

వడ్లు కొంటారా? కొనరా?

బండి సంజయ్‌ ఏమైనా డ్రైవరా?
కేంద్రంపై దుమ్మెత్తి పోసిన సీఎం కేసీఆర్‌
12న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు

విశాలాంధ్ర`హైదరాబాద్‌: అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్‌ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. అందులో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్‌.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? బీజేపీ నియమించిన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆ పార్టీకి చెందిన వరుణ్‌ గాంధీ రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్‌ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. పంజాబ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనిపై సమాధానం చెప్పేదాకా.. కేంద్రాన్ని, బీజేపీని వదిలిపెట్టం. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈ రోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ రాయలసీమకు నీళ్లివ్వాలని చెప్పా. భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? బండి సంజయ్‌ యాసంగిలో వడ్లు వేయాలని చెప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు పెడతా. బండి సంజయ్‌, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడ అని బండి సంజయ్‌ ప్రశ్నిస్తున్నారు. అసలు ఉద్యమంలో ఆయనెక్కడ ఉన్నారు? ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు నీ పేరైనా తెలుసా?.బీజేపీ నేతల కథ తేల్చేదాకా రోజూ మాట్లాడతా. ఇకపై రోజూ కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దేశద్రోహులమా అని కేసీఆర్‌ ప్రశ్నించారు.
కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. మేం లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. జోనల్‌ చట్టం తీసుకొచ్చాం.. ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. జోనల్‌ విధానం అమలు కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. మేం చేయగలిగిందే చెబుతాం. కేసీఆర్‌ తెలంగాణకు ఏం చేశారన్నది జోక్‌ ఆఫ్‌ ది మిలీనియం. తెలంగాణ పథకాలను పార్లమెంటులో మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రగతిని ఆర్‌బీఐ మెచ్చుకుంది. తెలంగాణ సాధించిన ప్రగతిని ఏ బీజేపీ రాష్ట్రమైనా సాధించిందా? ఎన్నోసార్లు రాజీనామాలు విసిరికొట్టాం. మేం పదవులకు భయపడతామా? ఉద్యమ సమయంలో బీజేపీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కిషన్‌రెడ్డి పారిపోయారు. పదవులను చిత్తు కాగితాల్లా విసిరికొట్టాం. ఎస్సీని కొన్ని కారణాల వల్ల సీఎం చేయలేకపోయాం. అయినా ప్రజలు స్వాగతించారని కేసీఆర్‌ అన్నారు. మీకు భయపడటానికి మాకెలాంటి వ్యాపారాలు లేవు. దందాలు లేవు. ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. మేమెందుకు భయపడతాం. మాకేం మనీ ల్యాండరింగులు లేవు. కేసీఆర్‌ ఫౌమ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వేమైనా ట్రాక్టర్‌ డ్రైవర్‌వా..? అనవసర ప్రయత్నాలు చేస్తే భూమరాంగ్‌ అవుతది జాగ్రత్త అని బండి సంజయ్‌నుద్దేశించి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
12న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా
వడ్లు కొనాలని 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. వడ్లుకొనే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టం. భారత్‌ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారని చెబితే దేశద్రోహులవుతారా? దేశాన్ని కాపాడమన్నోడు దేశద్రోహా.. వదిలేసినోడు దేశద్రోహా? ఏపీలో ఏడు మండలాలను కలిపినప్పుడు మీరెక్కడ ఉన్నారు. దయచేసి రైతులెవరూ వరి వేయకండి. వీళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. విత్తన కంపెనీలతో ఒప్పందాలు ఉన్న రైతులు ధాన్యం పండిరచుకోండి. ఒకవేళ మిల్లర్లతో మీకు ఒప్పందం ఉన్నా.. నష్టమొచ్చినా పర్లేదు అనుకున్నవారు మాత్రమే వరి వేయండి. మీ మంచి కోసమే చెప్తున్నాం. కేంద్రం పాలసీ సరిగా లేదు కాబట్టే.. ఇవాళ వరి వేయొద్దంటున్నాం. ఒకవేళ కేంద్రం కొంటామని హామీ ఇస్తే వరి వేద్దాం. బీజేపీ నాయకులు, ఎంపీలు కనిపిస్తే వడ్ల కొంటారా? కొనరా? అని ప్రశ్నించాలి. డీజిల్‌ మీద, పెట్రోల్‌ మీద కేంద్రం సెస్‌ ఉపసంహరించుకోవాలి. వెనక్కి తీసుకునే వరకూ ప్రజల పక్షాన పోరాడతాం. పన్నుల సొమ్ముతో జాతీయ రహదారులు వేశామని చెబుతున్నారు. ఇంతకుముందున్నవి కేంద్ర ప్రభుత్వాలు కావా? వారు ఇలానే చెప్పుకున్నారా?’’ అని కేసీఆర్‌ నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img