Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చు

. 3 రాజధానులపై వెనక్కి తగ్గాలి
. జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు తగదు
. అన్ని రంగాల్లో మోదీ విఫలం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

(విశాలాంధ్రబ్యూరో`గురుదాస్‌ దాస్‌గుప్తా ప్రాంగణం, విజయవాడ):
నాడు ప్రతిపక్ష హోదాలో అమరావతి రాజధానికి మద్దతిచ్చిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌…అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో చేసిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారంలోకి తీసుకువెళతామన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధానాలపై సీఎం జగన్‌ వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ గురుదాస్‌ దాస్‌గుప్తా ప్రాంగణం(ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌) మీడియా పాయింట్‌ వద్ద ఆదివారం రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతే రాజధానిగా ఉండాలని తీర్మానించినట్లు చెప్పారు. సీపీఐ జాతీయ మహాసభల్లో భాగంగా ఈనెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించిన మహాప్రదర్శన విజయవంతమైందని చెప్పారు. మొదటి రోజు జరిగిన ప్రతినిధుల సభకు వామపక్ష పార్టీల నేతలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారన్నారు. అమరావతి రాజధానిపై సీఎం జగన్‌ మొదటి నుంచి మొండి వైఖరితో ఉన్నారని విమర్శించారు. అధికారంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించపోగా మూడు రాజధానుల పేరిట రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన గర్జనకు ఏ మాత్రం స్పందన లేదని, అధికార పార్టీ ఏర్పాటు చేసిన జేఏసీలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులే ఉన్నారని, జగన్‌ భజన చేసేవారే హాజరయ్యారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో అలజడులు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సీఎం జగన్‌కు సరికాదని, పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపు ధోరణులకు పాల్పడటం తగదన్నారు. సీనియర్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు రాజధానిపై చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవన్నారు. నాడు అమరావతి రాజధాని ప్రకటించిన సమయంలోను, రైతులకు భూములిచ్చిన సమయంలోనూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖలో జనసేన కార్యకర్తలపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల్ని జగన్‌ ప్రభుత్వం అవలంబించడాన్ని రామకృష్ణ వ్యతిరేకించారు. ఇకనైనా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఆపాలని, లేకుంటే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బీజేపీ నేత సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖల్ని రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశానికి ఏమి చేశారని ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కార్పొరేట్‌, దోపిడీదారులకు అడ్డగోలుగా మోదీ సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి మోదీ పదేపదే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి అధికారం ఇస్తే పోలవరం పూర్తి చేస్తామని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఉత్తరకుమార ప్రగల్భాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కడపలో స్టీలు ప్లాంట్‌ నిర్మించలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని విమర్శించారు. మోదీ, జగన్‌ కలిసి ప్రభుత్వ రంగ సంస్థలు, పోర్టులను ప్రైవేట్‌పరం చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img