Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రాజెక్టులను గాలికి వదిలేశారు

. రూ.20 వేల కోట్లు కేటాయించాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. చింతలపూడి, విస్సన్నపేటలో పార్టీ బృందం పర్యటన

విశాలాంధ్ర`చాట్రాయి/విస్సన్నపేట టౌన్‌ : జగన్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తక్షణమే రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చీపురుగూడెం తమ్మిలేరులో చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను, ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలంలోని ఎన్‌ఎస్‌పీ ఎడమకాలువ మూడవ జోన్‌ నుంచి రైతులకు నీటినందిస్తున్న తీరును సీపీఐ బృందం శనివారం పరిశీలించింది.
అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు. ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత గల చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి, రెండో దశ పనులు నిలిచిపోయాయన్నారు. దీనివలన రెండు జిల్లాల తాగు, సాగునీరు సమస్య పరిష్కారమయ్యేదని, ఈ విషయం తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు ఇప్పటికే రూ.3500 కోట్లు ఖర్చు చేశారని, మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు చేస్తే పూర్తవుతుందన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గల నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామన్నారు. రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు ఎందుకు కేటాయించకూడదని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు. రాజకీయ పక్షపాతంతో కర్ణాటక ప్రభుత్వానికి రూ.5300 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాగార్జునసాగర్‌ మూడో జోన్‌లో లెక్క ప్రకారం నీటి వాటాను రాబట్టాలన్నారు.
ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలంలో ఎన్‌ఎస్‌పీ ఎడమకాలువ మూడవ జోన్‌ నుంచి రైతులకు నీటినందిస్తున్న తీరును సీపీఐ బృందం పరిశీలించింది. రామచంద్రపురం రెగ్యులేటర్‌ వద్ద నీటిని విడుదల చేస్తున్న తీరు గురించి ఎన్‌ఎస్‌పీ అధికారులను అడిగి తెలుసుకున్నది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తాజాగా ఎన్‌ఎస్‌పీ ఎడమకాలువ నీటి విడుదల తీరు, చింతలపూడి ఎత్తిపోతల నిర్మాణ పనులను పరిశీలించినట్లు చెప్పారు. మూడవజోన్‌ పరిధిలో మూడు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువలు ఉండగా, కనీసం 500 క్యూసెక్కుల నీరు కూడా రైతులకు అందటం లేదన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లాలోని ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు పరిధిలోని సుమారు రెండు లక్షల ఎకరాల భూములు ఎండు దశకు చేరాయని, సక్రమంగా నీటినందించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టు భవనాలు శిథిలావస్థకు చేరి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, వీటిని సక్రమంగా వినియోగించుకునే దిశగా నిధులు అందించకుండా అధికారులను వేధించటం సబబు కాదని సూచించారు. ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల రైతుల ప్రయోజనాల దృష్ట్యా కనీసం రోజుకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, రైతు సంఘం నాయకులు యలమందరావు, పి.జమలయ్య, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్‌, రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు, ఏలూరు జిల్లా నాయకులు కొమ్మన నాగేశ్వరరావు, పెనుమత్స రామకృష్ణంరాజు, రాయంకుల లక్ష్మణరావు, బత్తుల వెంకటేశ్వరరావు, చలసాని నరేంద్ర, పుల్లారావు, ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు నాగుల్‌ మీరా, ఎం.త్యాగరాజు, చిలుకూరి వెంకటేశ్వరరావు, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ డైరెక్టర్‌ బొట్టు రామచంద్రరావు, పగడాల అప్పారావు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈఈ అప్పారావు, డీఈఈ రవికిరణ్‌, జిల్లా నాయకులు మేకల డేవిడ్‌, కొత్తపల్లి సుందర్రావు, ఎం.త్యాగరాజు, గంజాల నాంచారయ్య, అంగోతు నాగు, బాణావతు పెద బాలూనాయక్‌, బుడ్డి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img