Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రాణాంతక ప్రయాణం!

విశాలాంధ్ర ` అవనిగడ్డ : ప్రమాదం అని తెలిసినా ప్రయాణం చెయ్యక తప్పడం లేదు. పాలకుల నిర్లక్ష్యం, స్వార్థ ప్రయోజనాలు ఆ గ్రామస్తుల పాలిట శాపంగా మారాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆనక ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో మాత్రం మొఖం చాటేస్తున్నారు. ఫలితంగా కృష్ణానదిలో భయంతో వణుకుతూ ప్రయాణం చెయ్యలేక విద్యార్థులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామం నుంచి అవనిగడ్డ రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రావాల్సిందే. ఈ గ్రామం కృష్ణానది పాయల నడుమ దిబ్బపై ఉంది. నది పాయల మీద కాజ్‌వే, వంతెనగానీ లేకపోవడంతో ప్రతి సంవత్సరం వస్తున్న వరదలకు రోడ్డు మార్గం కొట్టుకుపోతోంది. దీంతో పాత ఎడ్లంక వాసులు గ్రామంలోకి రావాలన్నా, బయటకు చేరుకోవాలన్నా కృష్ణానదిలో నాలుగు అడుగుల మేర నీటిలో నడిచి ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా తాటి పట్టెలను ఏర్పాటు చేసుకోగా వాటిపై విద్యార్థులు నడవాలంటే భయంతో వణికిపోతున్నారు. గత మూడు సంవత్సరాలుగా నదిలోని కాజ్‌వే రహదారి కొట్టుకు పోవడంతో సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ముఖంగా అనేకసార్లు తెలియచేసినప్పటికీ గ్రామస్తుల బాధలను పట్టించుకోలేదు. నదిలో ఇసుక, బసుక తవ్వకాల వలన రహదారులు కొట్టుకుపోతున్నాయని, గ్రామం చుట్టూ ఉన్న గట్టు ప్రతి సంవత్సరం కోతకు గురవ్వడంతో గ్రామమే కనుమరుగు అయ్యే పరిస్థితి కనబడుతోందని అన్నారు. ఇసుక, బుసక ఖనిజ వనరులకు గ్రామాన్ని వినియోగించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 1,100 మంది జనాభా, 700 పై చిలుకు ఓటర్లు ఉన్నప్పటికీ, వారంతా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కాలాన్ని భారంగా గడుపుతున్నారు.
అనేకసార్లు గ్రామస్తులే స్వచ్ఛందంగా కాలిబాటను ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందని, తరచూ వచ్చే వరదలకు అవి కూడా కొట్టుకుపోతున్నాయని, శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి నిర్మాణం చేసి తమ కష్టాలను తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img