Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఫోర్త్‌ వేవ్‌ ఎప్పుడైనా రావచ్చు.. అప్రమత్తంగా ఉండండి

ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
ఫోర్త్‌ వేవ్‌ ఎప్పుడైనా రావచ్చు. అప్రమత్తంగా ఉండండి అంటూ ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించింది. చాలా రోజుల నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించటం లేదు. పాజిటివిటీ రేటు చాలా వరకు పడిపోయింది. అక్కడో ఇక్కడో ఒకటి అర కేసులు బయటపడినా రికవరీ రేటు బాగానే ఉంది. అంతా ప్రశాంతమే అనుకుంటున్న తరుణంలో దాదాపు 84 రోజుల తరవాత దేశవ్యాప్తంగా 24 గంటల్లో 4 వేల కేసులు నమోదయ్యాయి. ముంబయిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ కూడా కొవిడ్‌ ఆంక్షల్ని కఠినతరం చేయనుంది. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ ఐదు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖ రాశారు. ఈ రాష్ట్రాల్లో మరోసారి వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదముందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య విభాగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మూడు నెలలుగా కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల కనిపించనప్పటికీ మే చివరి వారం నుంచి పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటాన్ని గమనించాలని లేఖలో ప్రస్తావించారు రాజేశ్‌ భూషణ్‌. తెలంగాణలో మే 27 నాటికి 287 కొత్త కేసులు వెలుగులోకి రాగా, జూన్‌ 3న తేదీ నాటికి ఆ సంఖ్య 375కి పెరిగిందని లెక్కలతో సహా వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంబయిలో ఫోర్త్‌ వేవ్‌ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య పెంచాలని ఆరోగ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో కనీసం 60% మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img