Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో బండి సంజయ్‌ అరెస్ట్‌

. ఉద్రిక్తతల మధ్య పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు
. హన్మకొండ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
. ఈ నెల 19 వరకు రిమాండ్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌/వరంగల్‌:
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఉహించని మలుపు తిరిగింది. బుధవారం తెల్లవారుజామున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్ట్‌ చేశారు. హన్మకొండ మొదటి సెషన్స్‌ కోర్టు జడ్జి అనిత రాపోలు ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. వాదనలు విన్న అనంతరం జడ్జి.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడిరచారు. ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్‌ జైలుకు తరలించారు. సంజయ్‌పై కమలాపూర్‌ పోలీసులు తెలంగాణ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌, 1997 లోని సెక్షన్‌ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 120 బీ, సెక్షన్‌ 420, 447, 505 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో సంజయ్‌ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్‌, ఏ3గా మహేశ్‌, ఏ4గా మైనర్‌ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్‌, ఏ6గా పోగు సుభాష్‌, ఏ7గా పోగు శశాంక్‌, ఏ8గా దూలం శ్రీకాంత్‌, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్‌, ఏ10గా పోతబోయిన వర్షిత్‌ పేర్లను చేర్చారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడిరచారు.
లీకేజీలో ప్రధాన సూత్రధారి బండి
సంజయే: వరంగల్‌ సీపీ
టెన్త్‌ హిందీ పేపర్‌ లీకేజీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ కీలకంగా వ్యవహరించారని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సాప్‌ చాటింగ్‌, వాట్సాప్‌ కాల్స్‌ తరుచూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్‌ లీకేజీకి కుట్ర చేశారని సీపీ తెలిపారు. ఈ కేసులో బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచామని సీపీ పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్‌ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. బూర ప్రశాంత్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్‌ బాయ్స్‌ స్కూల్‌ నుంచి బయటకు వచ్చిందని సీపీ స్పష్టం చేశారు. మొదటగా ఉదయం 11:18 గంటలకు ప్రశాంత్‌ ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేశారు. 11:24 గంటలకు బండి సంజయ్‌కు ఫార్వార్డ్‌ చేశారు. తర్వాత చాలా మందికి ఫార్వార్డ్‌ అయిందని తెలిపారు. ప్రశాంత్‌తో పాటు మహేశ్‌ కూడా చాలా మందికి పంపించారు. ఈటల రాజేందర్‌, ఆయన పీఏకి కూడా పంపించారని, వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని ఫార్వార్డ్‌ చేసిన తర్వాత ప్రశాంత్‌ 149 మందికి కాల్‌ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.
బీజేపీ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. గురువారం ఉదయం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే హౌస్‌ మోషన్‌ విచారణకు హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్‌ విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. బండి సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో తెలంగాణ బీజేపీ లీగల్‌ సెల్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. మొత్తం ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్‌ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ బీజేపీ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు గానీ పార్టీకి గాని పోలీసులు వెల్లడిరచలేదని తెలిపారు. సీఆర్పీసీ 50 కింద అరెస్టు విషయాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి చెప్పాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన అత్తగారి కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నందున బండి సంజయ్‌ కరీంనగర్‌కు వెళ్లారని రాత్రి 11:30 నిమిషాలకు అక్రమంగా బండి సంజయన్‌ను అరెస్టు చేశారని పిటిషన్‌లో బీజేపీ పేర్కొంది. పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు గురువారం విచారణ జరుపనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img