Friday, April 19, 2024
Friday, April 19, 2024

బడి.. భళా..!

నాడు`నేడుతో సర్కారీ స్కూల్స్‌ రూపురేఖలు మార్పు

తొలిదశలో 15,715 పాఠశాలల అభివృద్ధి
అందం, ఆకర్షణ, వసతుల కల్పనకు రూ.4 వేల కోట్ల ఖర్చు
రేపు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్‌

అమరావతి : మనబడి నాడునేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలదన్నేలా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం తొలి దశ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 500 జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనతోపాటు వాటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మొత్తం మూడు దశల్లో వీటిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలి దశలో 15,717 పాఠశాలలను నాడునేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేశారు. కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితులను సైతం అధిగమిస్తూ పనులను నిరాటంకంగా కొనసాగిస్తూ తొలి దశ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తొలిదశలో నాడునేడు కింద పూర్తయిన ప్రభుత్వ పాఠశాలలు గుర్తు పట్టలేనంతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగులతో భవనాలు, తరగతి గదుల్లో అందమైన రంగురంగుల బెంచీలు,

ఫ్యాన్లు, అధునాతన బ్లాక్‌ బోర్డులు, ఆధునీకరించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఆకర్షణీయమైన క్రీడా మైదానాలతో సర్కారీ స్కూళ్లు ముస్తాబయ్యాయి. వీటన్నిం టినీ ఈనెల 16న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు రెండో దశ కింద మరో 15 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అదే రోజు ప్రారంభించనున్నారు. పాఠశాలను ఒక పవిత్ర దేవాలయంగా భావించి అందులో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించ డం ద్వారా పరీక్షా ఫలితాలను మెరుగుపరచడం, బడి బయట విద్యార్థుల సంఖ్యను తగ్గించి వారిని స్కూళ్లలో చేర్పించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందుకోసం 2019 నవంబరు 14 జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) పురస్కరించుకుని ప్రభుత్వం ‘మన బడి నాడు`నేడు’ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా రూ.16,700 కోట్ల ఖర్చుతో మూడు దశలలో పాఠశాలల ఆధునికీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించే పనులు పూర్తి పారద ర్శకతతో, నిబద్ధతతో, నాణ్యతతో సాగేలా ఆ బాధ్యతలను పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల అధ్వర్యంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ల ఆధునికీకరణతో పాటు దీనికి తోడు మరో 27,438 అంగన్‌ వాడీలను సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,715 పాఠశాలల అభివృద్ధి నిమిత్తం రూ.3,669 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపు చేసింది.
పది అంశాలపై దృష్టి
మొత్తం పది అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పనకు ఈ పథకంలో ప్రాధాన్యతనిచ్చారు. (1) నిరంతర నీటి వసతితో మరుగుదొడ్లు (2) రక్షిత తాగునీరు సరఫరా (3) పాఠశాలకు అవసరమైన మరమ్మతులు చేయడం (4) ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు (5) విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌ (6) గ్రీన్‌ చాక్‌ బోర్డు (7) పెయింటింగ్‌ (8) ఇంగ్లీష్‌ ల్యాబ్‌ (9) ప్రహరీ గోడ (10) వంట గది నిర్మాణం. ఇవన్నీ కూడా విద్యార్థులకు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉండేలా చేయాలని నిర్ణయించారు. నాడు- నేడు కార్యక్రమం అమలుకు ముందు ఉన్న స్థితి, అమలు తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫొటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమం రూపకల్పన వెనుక ఉన్న ముఖ్య సంకల్పం. దానికనుగుణంగా తొలిదశ పనులు ప్రారంభించినప్పుడు స్కూళ్లు ఎలా ఉన్నాయో ఫొటోలు తీసి, ప్రస్తుతం స్కూళ్లకు రంగులు వేసి అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత మరలా ఫొటోలు తీశారు. అలాగే ప్రతి పాఠశాల ఒకే ప్రామాణికత కలిగి ఉండేలా చేయడం, సామగ్రి తయారీదారుల దగ్గరే తీసుకోవడం, పరిశోధన, అభివృద్ధి ఆధారంగా అధిక గ్రేడ్‌ లక్షణాలు ఉన్న వస్తువులను సేకరించడం వంటి జాగ్రత్తలు పాటించారు. అందుకోసం కొన్ని వస్తువులను గుర్తించి వాటికోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచారు. సరఫరాదారులను రాష్ట్ర స్థాయి టెండర్‌ కమిటీ నిర్ణయించింది. ఈ టెండర్‌ ప్రత్యేక లక్షణం ఏమిటంటే అసలు సామగ్రి తయారీదారులు/ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులు.
ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన
ఇక నిరుపేద విద్యార్థులకు కూడా ఇంగ్లీషు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేద విద్యార్థులు రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూల్సుకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరోవైపు స్కూల్సు ప్రారంభం కాగానే వాటిలో చేరే విద్యార్థినీవిద్యార్థులకు యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగ్‌, టెక్ట్స్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, బెల్ట్‌, సాక్స్‌, బూట్లతో పాటు ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీలను జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వం అందజేస్తోంది. వీటిని పాఠశాలలు ప్రారంభించిన రోజే అందజేయడం మరో విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img