Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బడ్జెట్‌లో భరోసా ఏది?

. పేద, గ్రామీణ ప్రజల్లో నిరుత్సాహం
. అన్నింటా కోతలే
. ధరల నియంత్రణకు చర్యల్లేవ్‌
. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీలు గళమెత్తాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`గుంటూరు : కేంద్ర బడ్జెట్‌ సాధారణ ప్రజల జీవన పరిస్థితులను విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేవలం సంపన్న వర్గాలకే పెద్దపీట వేసిన ఈ బడ్జెట్‌ కోట్లాది మంది కష్టజీవులు, రైతులు, గ్రామీణ ప్రజలను నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నారు.
గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్‌లకు ఊడిగం చేయడంలో మునిగితేలుతున్న కేంద్రం…సాధారణ, పేద, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించిందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులలో 33 శాతం కోత విధించిందని, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు పత్తి కొనుగోలు నిమిత్తం గతంలో రూ.9 వేల కోట్లు కేటాయిస్తే…ఈసారి దానిని కేవలం లక్ష రూపాయలకు పరిమితం చేసిందని మండిపడ్డారు. రూ.50 వేల కోట్ల మేరకు ఎరువుల సబ్సిడీ తగ్గించిందని, ఆహార సబ్సిడీ గతంలో రూ.2.80 లక్షల కోట్లు కేటాయిస్తే నేటి బడ్జెట్‌లో రూ.1.97 లక్షల కోట్లు మాత్రమే కేటాయించి…రూ.90 వేల కోట్లు కోత విధించారని చెప్పారు.
పెట్రోలియం సబ్సిడీ కూడా రూ.6900 కోట్లు తగ్గించారని, విద్య, వైద్యానికి గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా ఈ బడ్జెట్‌లో తగ్గించినట్లు చెప్పారు. దళితులు, గిరిజనులకు కేటాయింపులు పూర్తిగా తగ్గాయని, ధరల నియంత్రణకు చర్యలు కనిపించలేదని, ఉద్యోగాల కల్పనకు ప్రాముఖ్యత ఇవ్వలేదని, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.
బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎంపీలు గళమిప్పాలని రామకృష్ణ హితవు పలికారు. బడ్జెట్‌లో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధుల ప్రస్తావన లేదన్నారు. అమరావతి రాజధానికి నిధులు కేటాయించలేదని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కానీ ఎన్నికల కోసం కర్ణాటకలో కరువు పీడిత ప్రాంతాలకు రూ.5300 కోట్లు కేటాయించి పక్షపాతంతో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తుంటే ఎంపీలు చేతులు కట్టుకుని కూర్చున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే కనీసం ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వలేని స్థితిలో ఎంపీలు ఉన్నారని మండిపడ్డారు. ఇటువంటి ఎంపీలు రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ఎంపీలు సొంత పనులకే పరిమితమవుతున్నారని, ఇలా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
6న జరిగే ధర్నాలో పాల్గొనండి
జగనన్న కాలనీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద సీపీఐ చేపట్టే ధర్నాలో పేదలు, టిడ్కో లబ్ధిదారులకు రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన సీఎం జగన్‌…ఇళ్లు నిర్మించి ఇస్తానన్న మాట తప్పారన్నారు. లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలని వలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రూ.1.80 లక్షలకు పునాది నిర్మించడమే కష్టమని, అలాంటిది మొత్తం ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. లారీ ఇసుక రూ.40 వేలు పలుకుతూ బంగారంతో సమానంగా మారిన నేపథ్యంలో పేదలు ఇసుక ఎలా కొంటారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వమే పేదల ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్‌ ఉచితంగా ఇచ్చి…రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img