Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బహుళత్వానికి ముప్పు

. భారతదేశం ద్వేషాన్ని తిరస్కరిస్తోంది
. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ లేఖ
. ‘జోడో యాత్ర’ కాంగ్రెస్‌ తదుపరి ప్రచారంలో లేఖ పంపిణీ

న్యూదిల్లీ : విభజన శక్తులు మన భిన్నత్వాన్ని మనకు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ భారతదేశం ద్వేషాన్ని తిరస్కరిస్తోందని, దుర్మార్గపు అజెండా ఇకపై కొనసాగదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’కు కాంగ్రెస్‌ పార్టీ తదుపరి ప్రచారంలో భాగంగా ప్రజల మధ్య పంపిణీ చేయనున్నట్లు రాహుల్‌ ఒక లేఖలో పేర్కొన్నారు. రాహుల్‌ లేఖతో పాటు పార్టీ కార్యకర్తలు జనవరి 26 నుంచి మార్చి 26 వరకు బ్లాక్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహించనున్న ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌’ లో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌ షీట్‌ కూడా పంపిణీ చేస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారంలో భాగంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, ఆరు లక్షల గ్రామాలు, దాదాపు 10 లక్షల ఎన్నికల బూత్‌లను కవర్‌ చేయనున్నామని, ఈ స్థాయిలో కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో ‘మహిళా యాత్ర’, బ్లాక్‌ స్థాయిల పాదయాత్రలు, జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహిస్తామని, ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని జైరాం రమేశ్‌ తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘ఛార్జ్‌ షీట్‌’తో పాటు కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు అందజేయనున్న రాహుల్‌ గాంధీ లేఖను కూడా ఆయన విడుదల చేశారు. ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు లక్షలాది మంది భారతీయులు మాతో కలిసి నడుస్తున్న 3,500 కిలోమీటర్ల చారిత్రాత్మకమైన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా నేను మీకు లేఖ రాస్తున్నాను. ఇది నా జీవితంలో అత్యంత సుసంపన్నమైన ప్రయాణం. ప్రతి ఒక్క భారతీయుడు మాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను పొంగిపోయాను’ అని తెలిపారు. ‘ఒక స్పష్టమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. యువతలో నిరుద్యోగం, భరించలేని ధరల పెరుగుదల, తీవ్రమైన వ్యవసాయం కష్టాలు, దేశ సంపదను పూర్తిగా కార్పొరేట్‌ స్వాధీనం చేసుకోవడం’ అని వివరించారు. ‘ఈరోజు మన బహుళత్వానికి కూడా ముప్పు పొంచి ఉంది. విభజన శక్తులు మన భిన్నత్వాన్ని మనకు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. విభిన్న మతాలు, వర్గాలు, ప్రాంతాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. కొద్దిమంది మాత్రమే ఉన్న ఈ శక్తులకు ప్రజలు అభద్రతాభావంతో, భయాందోళనలకు గురైనప్పుడు మాత్రమే ‘ఇతరుల’ పట్ల ద్వేషానికి బీజాలు వేయగలరని తెలుసు. కానీ ఈ యాత్ర తర్వాత, ఈ దుర్మార్గపు అజెండాకు దాని పరిమితులు ఉన్నాయని, అది ఇకపై కొనసాగదని నేను నమ్ముతున్నాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. వీధుల నుంచి పార్లమెంటు వరకు ప్రతిరోజూ, ఈ దురాచారాలను రూపుమాపడానికి పోరాడతానని గాంధీ వాగ్దానం చేశారు. ‘రైతుల ఉత్పత్తులకు సరైన ధర, యువతకు ఉద్యోగాలు, దేశ సంపదను సక్రమంగా పంపిణీ చేయడం, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం, చౌకైన డీజిల్‌, బలమైన రూపాయి, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌… ఇలా ప్రతి ఒక్కరికీ ఆర్థిక శ్రేయస్సును సృష్టించాలని నేను నిశ్చయించుకున్నాను’ అని ఆయన తెలిపారు. మన వైవిధ్యాన్ని స్వీకరించి, భుజం భుజం కలిపి పని చేస్తే తప్ప మన పూర్తి సామర్థ్యాన్ని మనం చేరుకోలేమని మన దేశ ప్రజలు గ్రహించారని ఆయన చెప్పారు.
‘భారతదేశం ద్వేషాన్ని తిరస్కరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. సమాజంలో చీలికలకు కారణమయ్యే కులం, మతం, భాష, లింగం, అన్ని ఇతర భేదాలకు అతీతంగా మనం ఎదుగుతాం. భిన్నత్వంలో ఏకత్వంలో మన గొప్పతనం దాగి ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. ‘దారో మత్‌ (భయపడకండి)’ అనే గాంధీ సందేశం కూడా లేఖలో భాగం, అందులో ఈ యాత్ర అందరి కోసం పోరాడే నా శక్తిని పునరుద్ధరించిందని, ఇది ‘నా తపస్సు’ అని కూడా తెలిపారు. ‘నా వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం ఒక్కటే – స్వరంలేని వారికి గొంతు వినిపించడం, దేశాన్ని చీకటి నుంచి వెలుగులోకి, ద్వేషం నుంచి ప్రేమకు, బాధల నుంచి శ్రేయస్సు వైపునకు తీసుకెళ్లడం. మనం రాజ్యాంగం అందించిన దార్శనికత, విలువలను నేను ముందుకు తీసుకువెళతాను’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సంస్థ బలహీనంగా ఉన్నందున ప్రతి ఇంటికి చేరుకోవడం సవాలుగా ఉంటుందని, అయితే ప్రజలకు చేరువయ్యే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని జైరాం రమేశ్‌ తెలిపారు. పంజాబ్‌లో ఒక రోజు విశ్రాంతి తర్వాత సాగే యాత్ర జనవరి 19న పఠాన్‌కోట్‌లోకి ప్రవేశిస్తుందని, అక్కడ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 20 సాయంత్రం జమ్ములో యాత్ర ప్రవేశిస్తుందని, ఆ తర్వాత విశ్రాంతి దినం ఉంటుందని, ఆ తర్వాత జనవరి 22న పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img