Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీకి షాక్‌..

హిమాచల్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌..
బెంగాల్‌లో టీఎంసీ విజయదుంధుభి

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు అక్టోబరు 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువ డ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో పట్టునిలుపుకోలేకపోయింది. హిమాచల్‌ప్ర దేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలలో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మమత పార్టీ దూసుకెళ్లింది. ఇక్కడ నాలుగు అసెంబ్లీ స్థానాలు ఖర్దా, శాంతిపూర్‌, గోసాబ, దిన్హాటలో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయపతాకాన్ని ఎగురవేసింది. దిన్హాటా, గోసబలో లక్షకుపైగా ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. ఖర్దాలో సీపీఎం కంటే బీజేపీ వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మాజీ మేయర్‌ సోవాందేబ్‌ చటోపాధ్యాయ ఈ స్థానంలో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నంది గ్రామ్‌లో ఓడిపోయారు. మళ్లీ ఆమె పోటీ చేయడానికి సోవాందేబ్‌ చటోపాధ్యాయ తన సీటును త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఖర్దా టికెటు ఇచ్చారు. కొత్తగా నాలుగు స్థానాల్లో గెలవటంతో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య 213కు చేరుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల వలసలతో సతమతమవుతున్న బీజేపీకి దిన్హాటా, శాంతిపూర్‌ ఎన్నికల ఓటమి పెద్దదెబ్బగా చెప్పొచ్చు. గోసాబలో టీఎంసీకి 87శాతం ఓట్లు రాగా ఖర్దాలో 93 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలు హంగల్‌, సిండ్‌గీల్లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ చెరొక స్థానంలో గెలుపొందాయి. హంగల్‌లో కాంగ్రెస్‌.. సిండ్‌గీలో బీజేపీ విజయం సాధించాయి. హంగల్‌లో బీజేపీ ఓటమితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. రాజస్థాన్‌లోని ధరియావాడ్‌, వల్లభ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీహార్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు కుశేశ్వర్‌ అస్థాన్‌, తారాపూర్‌ ఉప ఎన్నికలు జరగ్గా కుశేశ్వర్‌ అస్థాన్‌లో అధికార జేడీయూ గెలిచింది. మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో పృధ్వీపూర్‌, బోబత్‌ రాయ్‌గావ్‌, ఖండ్వా లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా బోబత్‌, పృధ్వీపూర్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాయ్‌గావ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం ఉంది. ఖండ్వా లోక్‌సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అసోంలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలు థోవ్‌రా, భవానీపుర్‌, మరియాని, గోసెన్‌ గావ్‌, తముల్‌పుర్‌ ఉప ఎన్నికలు జరుగ్గా..థోవ్‌రా, భవానీపుర్‌, మరియానిలో అధికార బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు స్థానాలు గోసెన్‌ గావ్‌, తముల్‌పుర్‌లో బీజేపీ మిత్రపక్షం యూడీడీఫ్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
మిజోరంలోని తూయిరియాల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార మిజోనేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి విజయం సాధించారు. హరియాణాలోని ఎల్లెనాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ(ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దల్‌) అభ్యర్థి అభయ్‌ చౌతాలా బీజేపీ అభ్యర్థి గోబింద్‌ ఖండాపై 6739 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేఘాలయలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. రాజబలలో అధికార ఎన్‌పీపీ విజయం సాధించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన దాదర్‌ నాగర్‌ హవేలి స్థానంలో శివసేన అభ్యర్థి కళాబేన్‌ దేల్కర్‌ విజేతగా నిలిచారు. ఆమెకు 51,269 ఓట్ల మెజారిటీ వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img