Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీజేపీతో వ్యవస్థలు ధ్వంసం

యూపీలో ఓటమి ఖాయం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్రబ్యూరో`అనంతపురం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను పాలక బీజేపీ ధ్వంసం చేస్తోందని సీపీఐ కార్యదర్శి డా.కె.నారాయణ విమర్శించారు. ప్రతిపక్షాలు, మావోయిస్టులతో కాకుండా బీజేపీతోనే దేశానికి ఎక్కువ ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు అక్టోబరులో విశాఖలో జరుగుతాయని చెప్పారు. అనంతపురం సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి కార్యాలయం, ఎన్నికల కమిషన్‌, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలన్నింటినీ మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని నారాయణ విమర్శించారు. దేశంలో కొనేవారు…అమ్మేవారు గుజరాత్‌ వాళ్లేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఆర్థిక నేరగాళ్లు జైలుకి వెళ్లారు. ఎన్డీయే హయాంలో 28 మంది ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు వెళ్లారని ఆయన అన్నారు. విజయ్‌మాల్యా తప్ప మిగిలిన వారంతా గుజరాతీయులేనని నారాయణ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మతాన్ని ముందుకు తెచ్చి విభజన రాజకీయాలు చేస్తున్నదని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామని డేరాబాబా లాంటి నేరస్తులను బయటికి తెచ్చారని, అయినా యూపీలో బీజేపీ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించబోతున్నా మని, కేసీఆర్‌ ప్రత్యామ్నాయ కూటమికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రత్యామ్నాయంపై జాతీయస్థాయిలో చర్చిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భయానక పరిస్థితులు ఉన్నాయని, వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళతామని వైసీపీ చెబుతోందన్నారు. ఏదైనా వ్యవస్థ తమకు అనుకూలంగా ఉంటే ఒకలా…లేకుంటే మరోలా మాట్లాడటం సరికాదన్నారు.
జగన్‌ అస్త్రాలు సిద్ధం: రామకృష్ణ
రాష్ట్రంపై విశ్వరూపం ప్రదర్శించడానికి సీఎం జగన్‌ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారని రామకృష్ణ చెప్పారు. ప్రజలపై పన్నుల భారం మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయమార్గాల అన్వేషణ పేరుతో సామాన్యులపైనా పన్నులు వేయడానికి జగన్‌ వెనుకాడబోరన్నారు. ఇప్పటికే ఓటీఎస్‌ పేరుతో బాదుతున్నారు. ఇసుక, మద్యం ధరలు పెంచారు. రాయలసీమ, నెల్లూరు వరదల్లో 69 మంది చనిపోయారని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. 2019 నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. 24న ఐదు జిల్లాల రైతులతో అనంతపురంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. పాలనా వ్యవస్థను సీఎం జగన్‌ ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌, సహాయకార్యదర్శులు జాఫర్‌, నారాయణస్వామి, నాయకులు వేమయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img