Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీని సాగనంపుదాం

. హిందుత్వ కార్పొరేట్‌ కూటమే మోదీ లక్ష్యం
. అదానీకి దేశ సంపద ధారాదత్తం
. ఫాసిస్టు సిద్ధాంతాల అమలు
. అంబేద్కర్‌ కోసం బీజేపీ, ఆరెస్సెస్‌ తపన
. సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వినయ్‌ విశ్వం, ప్రకాశ్‌ కారత్‌
. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై ‘ప్రచారభేరి’ ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులన్నీ ఏకమైతే 2024 ఎన్నికల్లో బీజేపీని సాగనంపడం ఖాయమని, ఇందుకు ఐక్య ఉద్యమాలు అవశ్యమని, రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వినయ్‌ విశ్వం, సీపీఎం కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ పిలుపునిచ్చారు. దేశంలో బడా పారిశ్రామిక రాజ్యాన్ని మోదీ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఐక్యఉద్యమాలు రావాలన్నారు. ‘ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీమోదీని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందామ’నే నినాదంతో సీపీఐ, సీపీఎం సంయుక్తంగా బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా చేపట్టిన ప్రచారభేరి సభ విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగింది. ప్రచారభేరి సభకు అధ్యక్షవర్గంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు వ్యవహరించారు. వినయ్‌ విశ్వం మాట్లాడుతూ విజయవాడకు రాగానే కమ్యూనిస్టు అగ్రనేతలు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వం వహించిన ఉద్యమాలు, తెలంగాణ పోరాట ఘటనలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న హిందుత్వ సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతం కమ్యూనిస్టుల దగ్గర ఉందన్నారు. మనకు మార్క్సిజం సిద్ధాంతం గొప్ప ఆయుధమని, వామపక్షాలు మార్క్సిజం సిద్ధాంతాన్ని అవలోకనం చేసుకొని ముందుకు నడవాలన్నారు. ఈ సిద్ధాంతాలను కొందరు వెక్కిరించడాన్ని తప్పుపట్టారు. మార్క్సిజమనేది ఒక శాస్త్రమని, కమ్యూనిస్టు మేనిఫెస్టెలో ఈ శాస్త్రాన్ని వివరించారంటూ విశ్లేషించారు. కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్లుగా పెట్టుబడి అనేది మొత్తం అందర్నీ తన బానిసలుగా చేస్తుందని, పెట్టుబడి విస్తరిస్తున్న కొద్దీ ఒక ఉద్యోగి, ఒక రచయిత ఇలా ఎవరైనా సరే…దానికి బానిసగా మారాల్సిందేనన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు అవేనన్నారు. తుదకు ప్రధాని మోదీ సైతం అదానీ అనే పెట్టుబడిదారుడికి బానిసగా మారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు అన్ని విషయాలు మాట్లాడతారుగానీ…అదానీ సంపద ఎలా పెరిగిందనే దానిపై నోరు విప్పడం లేదని విమర్శించారు. ఆ విషయం వచ్చినప్పుడు మైనమే సమాధానంగా ఉంటుందన్నారు. ఆ నిశబ్ధం వెనుక ఒక సిద్ధాంతం దాగి ఉందని, అదే ఫాసిజమని, ఆ ఫాసిస్టు సిద్ధాంతంతో దేశాన్ని పాలించేందుకు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు అంబేద్కర్‌ గురించి మాట్లాడతారుగానీ…ఆయన చెప్పిన సిద్ధాంతాల్ని అనుసరించడం లేదన్నారు. హిందూరాజ్యం అనేది దేశ విధానం కాదని అంబేద్కర్‌ నొక్కిచెప్పారని, దానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆరెస్సెస్‌, బీజేపీది సొంత సిద్ధాంతం కాదని, అది భారతదేశ ఫాసిస్టు సిద్ధాంతమని చెప్పవచ్చన్నారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడిన వీళ్లు భరతమాతను ఎలా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ఫాసిస్టు సిద్ధాంతాలను సవాల్‌ చేసే శక్తి కమ్యూనిస్టు సిద్ధాంతాలకే ఉందని పునరుద్ఘాటించారు. అవినీతి మచ్చలేని వారుగా కమ్యూనిస్టులున్నారని, వారికి ఈడీ, ఐటీ, సీబీఐ అంటే భయం ఉండబోదని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం ఎన్నికల కమిషన్‌ ఇచ్చే సర్టిఫికెట్లతో పనిచేయడం లేదని, ప్రజాపోరాటాలతో ప్రజలిచ్చిన సర్టిఫికెట్లతో ఈ పార్టీలు కొనసాగుతున్నాయని నొక్కిచెప్పారు. కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరమని, ఈ ఐక్యత కోసం ప్రతి సమస్యపైనా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాలని పునరుద్ఘాటించారు.
ప్రకాశ్‌ కారత్‌ ప్రసంగిస్తూ బీఆర్‌ అంబేద్కర్‌ను సొంతం చేసుకునేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. 70 ఏళ్లుగా లౌకికపార్టీలు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ వచ్చాయని, స్వాతంత్య్ర పోరాటంలో మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న విలువల్ని రాజ్యాంగంలో అంబేద్కర్‌ చేర్చి పరిరక్షించారని గుర్తుచేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని లక్షణాలను రాజ్యాంగం పుణికిపుచ్చుకుందని, ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌…కుల తత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, మనువాద విలువల్ని ఆయన వ్యతిరేకించారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మనువాదం ఆధారంగా రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆరెస్సెస్‌, బీజేపీ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని, 1925లో ఆరెస్సెస్‌ ఏర్పడినప్పుడు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రాలేదని గుర్తుచేశారు. ఆరెస్సెస్‌ ముస్లిములకు వ్యతిరేకంగా పోరాడుతుందని, భారత రాజ్యాంగాన్ని ఆరెస్సెస్‌ అంగీకరించలేదని, రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్య విధానంలో ఉండకూడదనేద వారి నిరంకుశ వాదనని, హిందూ రాజ్యంగా భారత రాజ్యాంగం ఉండాలనేది వారి కోరికని ధ్వజమెత్తారు. ప్రత్యేకించి మోదీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మనుస్మృతి ఆధారంగా హిందూ రాజ్యాంగంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నట్లు దుయ్యబట్టారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం స్వీకరించిన వారే…ఆ రాజ్యాంగాన్ని వమ్ము చేసి దానిస్థానంలో హిందుత్వ రాజ్యాంగం ఏర్పాటుకు కుటిల యత్నం చేస్తున్నట్లు విమర్శించారు. తుదకు రాజ్యం స్వరూపమే మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో ప్రజల తరపున మాట్లాడే వారి గొంతును మోదీ సర్కారు నొక్కుతోందన్నారు. పతిపక్ష నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగొల్పిదాడులకు పాల్పడుతోందన్నారు. అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతోందని ధ్వజమెత్తారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అదానీ ఆదాయం రూ.50 వేల కోట్లు ఉండగా…2022 నాటికి ఆయన ఆస్తి ఒక్కసారి రూ.10.50 లక్షల కోట్లకు ఎగబాకిందన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్‌ ప్రాజెక్టులను అదానీకి మోదీ ప్రభుత్వం అప్పగించడం వల్ల ఆయన ఆస్తులు పెరిగిపోయాయన్నారు. సామాన్య ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాలు మోపుతోందన్నారు. ‘భారతదేశం హిందూ రాష్ట్రంగా మారడమంటే…ఈ దేశం వినాశనం కావడమేనని బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పారని’ ప్రకాశ్‌ కారత్‌ గుర్తుచేశారు. ఈ దేశాన్ని వినాశనం నుంచి కాపాడేందుకుగాను సీపీఐ, సీపీఎం చేపట్టిన ప్రచారభేరి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవాని, సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.శ్రీదేవి, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నగర నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, పి.దుర్గాంబ, సీపీఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, నగర నాయకులు దోనేపూడి కాశీనాథ్‌, నాయకులు సత్తిబాబు, ఉభయపార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img