Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీపై పోరులో కలిసిరండి

ధర్మవరం ప్రచారభేరి సభలో రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర – ధర్మవరంటౌన్‌ : వైషమ్యాలతో మతసామరస్యాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని, మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకు పోరాటాలు ఆపబోమని తేల్చిచెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద సీపీఐ, సీపీఎం అధ్వర్యాన ప్రచారభేరి బహిరంగసభ మంగళవారం జరిగింది. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్ని కాపాడుకుందాం అని రామకృష్ణ పిలుపునిచ్చారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో వచ్చిన చేనేత కార్మికుల్ని రామకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. రామకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలపై ధర్మవరంలో సీపీఐ ఇటీవల భారీ ఆందోళన చేపట్టిందని గుర్తు చేశారు. దీనివల్ల అధికారుల్లో కదలిక వచ్చిందని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార భేరి మోగిస్తున్నామని, మే తర్వాత ప్రజలందరినీ కలుస్తామని తెలిపారు. బీజేపీ మత సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించుకోవడంలో ప్రజల సహకారం అవసరమని రామకృష్ణ కోరారు. రైతులు, చేనేత కార్మికులు ఆకలిచావులకు గురవుతున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం నాటి ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనను అడ్డుకుంటామని లేదా సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని పదేపదే చెప్పుకునే ముఖ్యమంత్రి…పేదలకు ఏమి చేశారని నిలదీశారు. అప్పులు ఇబ్బడిముబ్బడిగా తెచ్చిన ప్రభుత్వం…లబ్ధిదారులకు మాత్రం కొద్దిమొత్తమే ముట్టచెబుతోందని, మిగిలిన డబ్బు ఏమి చేస్తున్నదని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు లేవు. ప్రాజెక్టులు నిర్మించలేదు. కాలువలు తవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా…ఉన్నవి వెళ్లిపోతున్నాయని చెప్పారు. నాలుగేళ్లయినా మాజీమంత్రి వివేకానందారెడ్డి హత్యకేసును సీబీఐ తేల్చలేకపోయిందని, వివేకను ఎవరు చంపారో సీఎం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మతసామరస్యం, సమాఖ్యస్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. దేశ సంపదను కొద్దిమంది కుబేరులకు దోచిపెడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కు తదితర విషయాల్లో రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని సూచించారు.
దళితులపై దాడులు జరుగుతున్నా జగన్‌ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని రామకృష్ణ అన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేనేత కార్మికులకు ఏమి చేశారని ప్రశ్నించారు. మే 8 తేదీన ధర్మవరంలో ఇంటింటా తిరిగి చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, కౌలు, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మధు, సీపీఎం నాయకులు పెద్దన్న, రైతుసంఘం జిల్లా కార్యదర్శి రమణ, సీఐటీయూ జిల్లా నాయకులు అయూబ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుళ్లాయప్ప, రాజా, సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్‌, సహాయ కార్యదర్శి రమణ, రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుళ్లాయప్ప, కనగానపల్లె మండల కార్యదర్శి మహాదేవ్‌, బత్తలపల్లి మండల కార్యదర్శి బండల వెంకటేశ్‌, ముదిగుబ్బ మండల కార్యదర్శి శీను, వెంకటేశ్‌, చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పోతులయ్య, కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్‌, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img