Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీపై పోరులో రాజీపడం

ఇదే సోనియా, రాహుల్‌ సందేశం: గెహ్లాట్‌
న్యూదిల్లీ: మోదీ సర్కారుపై సైద్ధాంతిక పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ స్పష్టమైన సంకేతాలిచ్చారని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ అహంకారానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను పాలక బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ విమర్శించారు. సోనియా, రాహుల్‌పై ఆరేడు ఏళ్ల నాటి కేసులను తిరగతోడుతున్నారని, రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడికి ఇదే నిదర్శనమని ఆయన తెలిపారు. మనీలాండరింగ్‌ కేసులో రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడానికి నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అశోక్‌గెహ్లాట్‌, సచిన్‌ పైలెట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అశోక్‌ గెహ్లాట్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘మేము రాజీపడే ప్రసక్తేలేదని సోనియా, రాహుల్‌గాంధీ దేశానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. సిద్ధాంతపరంగా మేము పోరాడతాం. సీబీఐ, ఐటీ, ఈడీ, డీఆర్‌ఐ, న్యాయవ్యవస్థపై విపరీత ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. పొరపాటున ఎవరైనా నిజాయతీగా ఉంటే వారికి చుక్కలే’ అని చెప్పారు. ‘దేశాన్ని ఎటు తీసుకెళుతున్నామో ప్రతిభారతీయుడు ఆలోచించే సమయం ఆసన్నమైంది. బీజేపీ దేశమంతా కిరోసిన్‌ పోసి తగలబెడుతోందని రాహుల్‌గాంధీ లండన్‌లో చెప్పారు. ఇక్కడేమి జరుగుతుందో మీరు ఇప్పుడు చూస్తున్నారు. అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లు సృష్టిస్తున్నారు…ప్రోత్సహిస్తున్నారు. ఉద్రిక్తతలు పెంచుతున్నారు’ అని బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అహంకారం ప్రదర్శిస్తున్నారు. అహంకారం ఎంతోకాలం సాగదు. ఈరోజు కాకపోతే రేపైనా అది దిగకతప్పదు’ అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img