Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీజేపీ ఎమ్మెల్యే తనయుడి లంచావతారం

తీగలాగితే బయటపడ్డ నోట్ల కట్టలు
రూ.8 కోట్లు స్వాధీనం

బెంగళూరు: ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానని ఓ కాంట్రాక్టరు నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు రూ.6 కోట్ల నోట్ల గుట్టలను గుర్తించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి శాసనసభ్యుడు మాడాళు విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్‌…ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానని రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి లోకాయుక్త అధికారులకు దొరికాడు. ఎమ్మెల్యే తనయుడు ప్రశాంత్‌ బెంగళూరు జలమండలిలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ టెండరు విషయంలో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్త అధికారులకు సమాచారం ఇవ్వడంతో…వారు ప్రశాంత్‌ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడి నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. మైసూర్‌ శాండిల్‌ సబ్బును తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌కు విరూపాక్షప్ప చైర్మన్‌గా ఉన్నారు. ప్రశాంత్‌ను అధికారులు కేఎస్‌డీఎల్‌ కార్యాలయంలోనే అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ.2.02 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇంట్లో రూ.6 కోట్లు గుర్తించారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇప్పటికే సీఎంతో సహా అక్కడి నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తనయుడి అరెస్టుతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. కేఎస్‌డీఎల్‌ కార్యాలయంలోనే లంచం డబ్బును లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకోవడంతో విరూపాక్షప్పపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.అయితే, తనపైనా, తన కుటుంబంపైనా లోకాయుక్త కుట్ర పన్నిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరుపుతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img