Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ నయా ప్రచారం

పార్టీ ప్రయోజనాలకు ప్రభుత్వ పథకం వినియోగం
ఉచిత రేషన్‌ను వారే పంచేస్తున్న వైనం..
ఏజెన్సీలు.. ప్రభుత్వ వర్కర్లను రానివ్వని కాషాయ శ్రేణులు

న్యూదిల్లీ : దేశంలో కాషాయ పార్టీ(బీజేపీ) శ్రేణులు ‘నయా ప్రచారం’ చేపట్టాయి. తమ పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని బీజేపీ నాయకులు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. వాటిని పంపిణీ చేయాల్సిన ఏజెన్సీలు, ప్రభుత్వ వర్కర్లను రానివ్వకుండానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన బియ్యం సంచులను చేతపుచ్చుకొని ఫొటోలకు ప్రదర్శన ఇచ్చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల వ్యవహారం ఇదే తంతుగా ఉంది. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నా యోజన(పీఎం`జీకేఏవై) లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ను వారు పంపిణీ చేస్తుండటంపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోవడం లేదు. ఇక బీహార్‌లో బీజేపీ శ్రేణులు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాయి. ప్రభుత్వ పథకం కింద నవంబరు 2021 వరకు ప్రతి నెల ప్రతి రేషన్‌ కార్డు దారుడికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు అందిస్తారు. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా తీసుకున్న చర్య ఇది.
బీహార్‌లో దాదాపు 1.6 కోట్ల మంది రేషన్‌ కార్డు దారులు ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రంతో కూడిన సంచుల్లో రేషన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌, రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ, బీహార్‌ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్‌ పాండే సహా అనేక మంది బీజేపీ సీనియర్‌ నాయకులు ఇటీవల ఈ సంచుల్లో రేషన్‌ను పంపిణీ చేయడం కనిపించింది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌ అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ మాట్లాడుతూ ‘ఒక ప్రభుత్వ వేదికను బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుంది..? కాషాయ శ్రేణులు తమ పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నాయి. రేషన్‌ కార్డు దారులు ఉచిత బస్తాలతో రేషన్‌ పొందుతున్నట్లుగా బీజేపీ ప్రదర్శన ఇస్తుంది’ అని విమర్శించారు. అయితే ప్రభుత్వ వర్కర్లు, ఏజెన్సీలు మాత్రమే ఉచిత రేషన్‌ను పంపిణీ చేయాలన్నది సుస్పష్టమని అన్నారు. దీని నుంచి బీజేపీ నాయకులు ‘అనవసర ప్రయోజనం’ పొందాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్‌జేడీ కార్యకర్తలు పని చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం, బీజేపీ మధ్య ఉన్న గీతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, బీజేపీ చేస్తున్నది అన్యాయమని కాంగ్రెస్‌ నాయకుడు ప్రేమ్‌ చంద్ర మిశ్రా అన్నారు. ‘ప్రస్తుతం దానికి ఏదైనా సాధ్యమే. కానీ బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా మేము ప్రతిపక్షంగా మా స్వరాన్ని పెంచడం మాత్రమే చేయగలము’ అని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరిస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన పీఎం`జీకేఏవై ఒక విప్లవాత్మక పథకమని పేర్కొంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img